జమ్ముకశ్మీర్ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించబోమని ఐరాస వేదికగా భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తేల్చిచెప్పారు. జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల కమిషన్ సదస్సులో ఆర్టికల్ 370 రద్దుతో లింగ వివక్షత తగ్గిపోయి.. బాలలహక్కులు, విద్యాహక్కులు మెరుగుపడతాయని స్పష్టం చేశారు ఠాకూర్.
సరిహద్దుల వెంబడి ఉగ్రదాడులు జరగొచ్చన్న హెచ్చరికల నడుమ కశ్మీర్‌లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మానవ హక్కుల ముసుగులో కొంతమంది అంతర్జాతీయ వేదికను దురుద్దేశ పూర్వకంగా రాజకీయ అవసరాలకోసం ఉపయోగించుకుంటున్నారని పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. అసోంలో జాతీయ పౌర జాబితా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన పారదర్శకమైన,చట్టబద్ధమైన ప్రక్రియగా ఠాకూర్పేర్కొన్నారు.
"మా పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలు అనేక చర్చల అనంతరం తీసుకున్నవి. ఆ నిర్ణయాలకు అన్ని పక్షాలనుంచి మద్దతు లభించింది. అవన్నీ దేశ సార్వభౌమ నిర్ణయాలు. పూర్తిగా భారత అంతర్గతం. ఇందులో ఏ దేశానికి జోక్యం చేసుకునే అధికారం లేదు.
దేశాలు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రాథమిక జీవనానికి విఘాతం కల్గిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమష్టిగా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాద సంస్థలకు, వారిని ప్రోత్సహిస్తున్నవారి గురించి గళమెత్తాల్సిన అవసరముంది.
ఇక్కడున్న ఓ ప్రతినిధి బృందం నా దేశం గురించి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వాక్చాతుర్యంతో కూడిన ఆ వ్యాఖ్యానాలు అంతర్జాతీయ తీవ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్నప్రాంతం చేస్తోందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉగ్రవాద సంస్థల కీలకనాయకులు ఏళ్ల తరబడి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. దౌత్య వ్యూహాల్లో ఉగ్రవాదాన్ని ఒక విధానంగా ఆ దేశం ప్రోత్సహిస్తోంది."
-విజయ్ థాకూర్ సింగ్, విదేశీ వ్యవహారాలశాఖ (తూర్పు) కార్యదర్శి
ఇదీ చూడండి: కశ్మీర్‌లో ఆంక్షలు సడలించండి: ఐరాస హెచ్ఆర్సీ