ఐరోపాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. జర్మనీలో వరదల ధాటికి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్యను అధికారులు ధ్రువీకరించారని 'న్యూయార్క్ టైమ్స్' ఓ కథనంలో తెలిపింది. అయితే.. గల్లంతైన మరో 1,300 మంది గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని చెప్పింది.
రెండు పశ్చిమ జర్మనీ రాష్ట్రాల్లోని నగరాలను, గ్రామాలను వరదలు ముంచెత్తాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే 58 మంది మృతి చెందారని తెలుస్తోంది. ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాల వల్ల సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. గల్లంతైన వారు సురక్షితంగా ఉండి ఉంటారని అధికారులు ఆశిస్తున్నారు. జర్మనీలోని అహర్వీలర్ జిల్లాలో ఆరు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రాంతంలోనే 18 మంది మరణించారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా చాలా ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది.
ఇతర దేశాల్లోనూ..
బెల్జియంలో వరదల ధాటికి మరో 11 మంది చనిపోయారు. మ్యూస్ నది ఉద్ధృతంగా ప్రవాహిస్తూ ఉండటం వల్ల.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్లోనూ వరదల విలయం కొనసాగుతోంది.
వరద ప్రభావిత ప్రాంత ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర స్పందన సిబ్బంది, సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. గల్లంతైనా వారి ఆచూకీని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆందోళన..
2050 వరకు కర్బన ఉద్గారాలను తటస్ఠీకరించాలని.. యూరోపియన్ యూనియన్ ప్రకటించిన కొన్నిరోజులకే ఈ వరదల విలయం అక్కడ ఏర్పడటం గమనార్హం. మరోవైపు.. వరదల బీభత్సానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణ కార్యకర్తలు, రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: తప్పిన భారీ ముప్పు- సౌర తుపాను ప్రభావం శూన్యం!