Russia Ukraine conflict: బాంబు దాడులు, క్షిపణుల మోతలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కట్టుబట్టలతో దేశం దాటుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేక కాలినడకనే వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. రష్యా సైనిక దాడులతో ఉక్రెయిన్ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. పోలాండ్ సరిహద్దుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లవీవ్ నగరం శరణార్థులతో నిండిపోయింది. ప్రతి రోజు వందల సంఖ్యలో ఆ నగరానికి చేరుకుంటున్నారు.
లవీవ్ నగరానికి చేరుకున్న శరణార్థుల్లో భారత పౌరుడైన గగన్ మోగా ఒకరు. 8 నెలల గర్భవతి అయిన భార్య, చిన్న పాపతో దేశం విడిచి వెళ్లేందుకు కీవ్ నగరం నుంచి లవీవ్కు వచ్చామని, ప్రస్తుతం తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న పౌరుల తరలింపు కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగలో భారత్కు వచ్చేందుకు అవకాశం ఉన్నా.. ఉక్రెయిన్ పౌరురాలైన భార్య, బిడ్డ కోసం అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు గగన్.
"నేను భారత పౌరుడిని. నేను భారత్కు వెళ్లగలను కానీ, ఉక్రెయిన్ పౌరురాలైన నా భార్య రాలేదు. కేవలం భారతీయులనే తీసుకెళ్తున్నారని నాకు చెప్పారు. నా కుటుంబాన్ని ఇక్కడే వదిలేయలేను. నా భార్య ఇప్పుడు 8 నెలల గర్భవతి. చిన్న పాప ఉంది. నా భార్య వాళ్ల అమ్మ, నేను ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం లవీవ్లో మా స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాం. వాళ్లు మాకు చాలా సాయం చేస్తున్నారు. డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఆశ్రయం కల్పించారు."
- గగన్ మోగా, ఉక్రెయిన్లోని భారతీయుడు
రష్యా దాడులతో కీవ్, ఖార్కివ్, ఖేర్సన్ నగరాలను ప్రజలు వీడి ఇతర దేశాలకు పారిపోతున్నట్లు చెప్పారు గగన్ మోగా. వారి బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యా దాడులకు కేంద్ర బిందువైన కీవ్లోని బుచా ప్రాంతంలో తాము నివసించే వారిమని, ప్రతి రోజు, ప్రతి క్షణం బాంబులు, క్షిపణుల మోతలు, యుద్ధ విమానాలను చూశామని తెలిపారు గగన్. అవి అత్యంత భయానక క్షణాలుగా చెప్పుకొచ్చారు. తన స్నేహితుడితో పాటు భార్యాబిడ్డలతో అతి కష్టంమీద ఓ వాహనంలో లవీవ్ చేరుకున్నట్లు చెప్పారు. పోలాండ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటున్నానని, అయితే, అది తన భార్యాబిడ్డలతోనేనని చెబుతున్నారు. ప్రస్తుతం లవీవ్లో తన స్నేహితుడు చాలా సాయం చేస్తున్నాడని చెప్పారు గగన్. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ కృషి చేయాలని కోరారు.
ఇదీ చూడండి: యుద్ధభూమిలో ఉండలేక.. అయినవారిని వీడలేక.. ఉక్రెయిన్ ప్రజల భావోద్వేగం