ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులే పనిదినాలుగా నిర్ణయించాలని ఫిన్లాండ్ ప్రధాని సనా మెరిన్ ప్రతిపాదించారు. దీంతో పాటు ప్రతిరోజూ ఎనిమిది గంటలకు బదులుగా ఆరు గంటలు మాత్రమే పని గంటలు ఉండాలని పేర్కొన్నారు.
‘కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ఉద్యోగుల హక్కు. వారికి కార్యాలయ పనులతో పాటు సమాజం, ఇష్టమైన వారికి సమయం కేటాయించడం, అలవాట్లను కాపాడుకోవడం వంటివి కూడా ఎంతో ముఖ్యం’ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఫిన్లాండ్‌లో వారానికి ఐదు రోజులు పనిదినాలుగా పాటిస్తున్నారు. పని గంటలు మాత్రం ఇతర దేశాల్లాగే ఎనిమిది గంటలు ఉంది.
ప్రధాని ప్రతిపాదనకు ఆ దేశ విద్యాశాఖ మంత్రి లీ అండర్సన్ మద్దతు తెలిపారు. దేశ ప్రజలపై పనిభారం తగ్గించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మంత్రిమండలిలో ఆమోదం పొందితే ఇక నుంచి ఆ దేశంలో నాలుగు రోజుల పనిదినాలు అమలు కానున్నాయి. స్వీడన్‌లో 2015 నుంచే ఆరు గంటల పని విధానం అమలు చేస్తున్నారు. అక్కడ ఉత్పాదకలో మంచి ఫలితం వచ్చింది. ఫ్రెంచ్‌లోనూ నాలుగు రోజుల విధానం అమలు చేస్తున్నారు. తాజాగా ఫిన్లాండ్‌లోనూ అదే ప్రతిపాదన పెట్టడంతో ఆ దేశ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.