కరోనా వైరస్ పుట్టుకపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు రేకెత్తుతున్న వేళ చైనాలోని వూహాన్ ప్రయోగశాలలోనే ఇది తయారైనట్లు ప్రఖ్యాత శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత లూక్ మోంటాగ్నియర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఎయిడ్స్ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన మోంటాగ్నియర్ కరోనావైరస్ అడవి జంతువుల నుంచి వూహాన్ మార్కెట్‌కు వెళ్లిందనే వార్తను తాను నమ్మట్లేదన్నారు. వుహాన్ ల్యాబ్‌లో ఎయిడ్స్ వైరస్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టిందని చెప్పారు. కరోనా వైరస్ జన్యురాశిలో హెచ్‌ఐవీ మూలకాలు, మలేరియా క్రిమి ఉండటం అనుమానించదగిన అంశమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ లక్షణాలు సహజ సిద్ధంగా ఉద్భవించినవి కావని తెలిపారు. కొన్నేళ్లుగా కరోనా వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న వూహాన్ పరిశోధనశాలలో ప్రమాదం సంభవించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ అనుమానాలకు ఊతం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్ నుంచే వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రొఫెసర్ లూక్ మోంటాగ్నియర్ ఆరోపణలతో ట్రంప్ అనుమానాలకు మరింత ఊతమందినట్లయింది.
"ఈ విషయాన్ని మేము పరిశీలిస్తున్నాము. వీటన్నిటినీ కలిపి చూస్తుంటే ఏదో జరిగిందనే భావన ఏర్పడుతోంది. ఒక రకమైన గబ్బిలం గురించి చైనా మాట్లాడుతోంది. అయితే ఆ గబ్బిలం ఆ ప్రాంతంలోనే లేదు. అది 40 మైళ్ల దూరంలో ఉంది. వుహాన్ మార్కెట్లలో ఆ రకమైన గబ్బిలాన్ని అసలు అమ్మనే లేదు." - డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు
వైరస్ పుట్టుక చుట్టూ అనేక వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని.. నిజాన్ని కచ్చితంగా బయటపెడతామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వుహాన్ వైరాలజీ ల్యాబ్‌కు.. మాజీ అధ్యక్షుడు ఒబామా తన హయాంలో 3.7 మిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేయడాన్ని గుర్తుచేశారు. త్వరలోనే ల్యాబ్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని స్పష్టంచేశారు.
ఈ పూర్తి వ్యవహారంపై వుహాన్ ల్యాబ్‌కు సంబంధించిన వివరాలను అమెరికా నిఘా అధికారులు సేకరిస్తున్నట్టు ఆ దేశ మీడియా కథనం ప్రచురిచింది. తమ వద్ద ఉన్న సమాచారంతో అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.
ఇదీ చూడండి:ఆసియాపై కరోనా పట్టు- స్పెయిన్‌లో తగ్గుముఖం