Russia Ukraine war: రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో భారీగా పౌర మరణాలు నమోదవుతోన్న విషయం తెలిసిందే. పెద్దలతోపాటు చిన్నారులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 112 మంది పిల్లలు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తాజాగా వెల్లడించింది. మరో 140 మంది గాయపడినట్లు తెలిపింది.
దివాలా దిశగా రష్యా!
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను నిరసిస్తూ పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యా.. దివాలా దిశగా పయనిస్తోంది! ఆంక్షల వల్ల.. ధరలు విపరీతంగా పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన నిధులున్నప్పటికీ.. అప్పులపై వడ్డీ చెల్లింపులు డాలర్లలో చేయలేక పుతిన్ సర్కార్ ఇబ్బందులు పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రష్యాపై దివాలా ముద్రపడే అవకాశముంది.
Russia Ukraine crisis
అజోవ్ సముద్రంపై యాక్సెస్ కోల్పోయిన ఉక్రెయిన్
మేరియుపోల్ నగరాన్ని రష్యా దళాలు చుట్టుముట్టడంతో అజోవ్ సముద్రంపై తాత్కాలికంగా పట్టు కోల్పోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ‘డొనెట్స్క్ ఆపరేషనల్ డిస్టిక్‌లో రష్యన్ బలగాలు పాక్షికంగా విజయం సాధించాయి. దీంతో కొద్దిసేపు అజోవ్ సముద్రంపై యాక్సెస్‌ను ఉక్రెయిన్ కోల్పోయింది’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఉక్రెయిన్ బలగాలు తిరిగి సముద్రంలోకి ప్రవేశించాయో లేదో వెల్లడించలేదు.
పసుపు రంగు సూట్‌లో రష్యన్ వ్యోమగాములు
రష్యాకు చెందిన ముగ్గురు కాస్మోనాట్లు శనివారం వేకువజామున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్)కి చేరుకున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న తొలి బృందం ఇదే కావడం గమనార్హం. అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రష్యన్ కాస్మోనాట్లు ఐఎస్‌ఎస్‌కు చేరుకునేటప్పటికి పసుపు రంగులో ఉన్న స్పేస్ సూట్‌ను ధరించి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.
చర్చలే మార్గం: జెలెన్‌స్కీ
రష్యా దాడులు శనివారానికి 24వ రోజుకు చేరిన వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి చర్చలకు పిలుపునిచ్చారు. ‘ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన, ఉక్రెనియన్ల భద్రత విషయంలో అర్థవంతమైన చర్చలే.. రష్యాకు తన స్వీయ తప్పిదాల నుంచి కలుగుతోన్న నష్టాలను తగ్గించుకోవడానికి ఏకైక మార్గం’ అని అన్నారు. ‘కలిసేందుకు.. మాట్లాడేందుకు.. ఉక్రెయిన్‌కు న్యాయం చేకూర్చేందుకు ఇదే సమయం. లేకపోతే, రష్యా భారీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. మళ్లీ పుంజుకోవడానికి తరాలు సరిపోవు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: పశ్చిమ దేశాలు వద్దు .. తూర్పు దేశాలు ముద్దు!