Mariupol Ukraine News: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను కొనసాగిస్తోంది. పోర్టు నగరమైన మరియుపోల్‌లో రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో మరియుపోల్‌లోని ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు కిందపడేసి.. నగరం విడిచి వెళ్లిపోవాలన్న పుతిన్ సేనల డిమాండ్‌ను ఆ దేశం వ్యతిరేకించింది. ఉక్రెయిన్ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఉపప్రధాని ఇరినా వెరెశ్చక్ స్పష్టం చేశారు. రష్యాకు కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు. మాస్కో విధించిన డెడ్‌లైన్‌ను ముందుగానే వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
మరియుపోల్ మేయర్ పియోటర్ ఆండ్రీషెన్కో కూడా రష్యా ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. రష్యా విధించిన డెడ్‌లైన్ కంటే ముందే ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని షాపింగ్ సెంటర్‌పై రష్యా జరిపిన దాడిలో 8 మంది మృతిచెందారు.
అంతకుముందు మరియుపోల్ నగరంలోని ఆర్ట్ స్కూల్‌పై రష్యా బలగాలు బాంబు దాడులకు పాల్పడ్డాయి. దాడి సమయంలో పాఠశాలలో దాదాపు 400 మంది శరణార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే దాడి తర్వాత పరిస్థితిపై మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇదే విషయాన్ని వీడియో ద్వారా తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. పాఠశాల దాడిలో ఎంతమంది సజీవంగా ఉన్నారో స్పష్టత లేదన్నారు.
సుమీ కెమికల్ ప్లాంటులో అమ్మోనియా లీక్..
Sumy Ukraine News: తూర్పు ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. రష్యా వైమానిక దళం జరిపిన బాంబు దాడుల్లో సుమీఖింపోరమ్ రసాయన ప్లాంట్ నుంచి అమ్మోనియా లీక్ అయిందని అధికారులు పేర్కొన్నారు. ప్లాంటుకు దాదాపు 5 కిలోమీటర్ల మేర అమ్మోనియా ప్రభావం ప్లాంటు కిలోమీటర్ల దూరం ఉంటుందని సుమీ గవర్నర్ ఓబ్లాస్ట్ మిత్రో తెలిపారు.
రసాయన పరిశ్రమకు సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిట్రిక్ యాసిడ్‌లో ముంచిన వస్త్రాలను ముక్కుకు అడ్డుగా ఉంచుకుని శ్వాస తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచనలు చేశారు. ప్లాంటు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 2,63,000 మంది నివసిస్తున్నారు.
రష్యా నౌకాదళ కమాండర్ మృతి..
రష్యాలోని బ్లాక్‌సీ ఫ్లీట్‌కు చెందిన సీనియర్ నౌకాదళ కమాండర్ ఆండ్రీ పాలీ.. ఉక్రెయిన్ మరియుపోల్‌లోని యుద్ధంలో మృతిచెందారు. ఈ విషయాన్ని సేవస్టోపోల్ పోర్ట్ సిటీ గవర్నర్ మైఖేల్ రాజోజయేవ్ తెలిపారు.
ఇవీ చూడండి:
నర్సింగ్‌హోంపై రష్యా ట్యాంకర్ దాడిలో 56కు చేరిన మృతులు
'ఆహారం, నీళ్లు ఇవ్వండి ప్లీజ్'.. బతిమలాడుతున్నా కరుణించని రష్యా సైన్యం