అయ్యయ్యో.. ఇటలీ! తల్చుకుంటేనే కన్నీరు ఉబికివస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇటలీకి దేశానికి శాపంగా మారింది. మార్చిని ఎప్పటికీ మర్చిపోలేని నెలగా మార్చేసింది. పదులా.. వందలా.. నేటికి 11,591 మంది కొవిడ్-19తో చనిపోయారు.
మరణించిన వారి స్మారకార్థం మంగళవారం ఇటలీ జాతీయ పతాకాలను అవనతం చేసింది. మౌనం పాటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశంలో ఇలాంటి మరణమృదంగం మోగడం ఇదే తొలిసారి. ‘ఈ వైరస్ ఒక గాయం. అది దేశమంతా గాయపర్చింది’ అని రోమ్ మేయర్ వర్జీనియా రాగి మౌనం పాటించిన తర్వాత అన్నారు. ‘మనందరం కలసికట్టుగా దీనిని ఎదుర్కొందాం’ అని పేర్కొన్నారు. వాటికన్ సిటీ సైతం సంఘీభావంగా పసుపు, తెలుపు జెండాలను అవనతం చేసింది.
ఫిబ్రవరి చివరి వారంలో మిలన్‌లో తొలి కరోనా కేసు గుర్తించారు. ఆ తర్వాత ఈ వైరస్ దేశమంతా వ్యాపించింది. మూడు వారాలుగా అక్కడ లాక్‌డౌన్ కొనసాగుతోంది. లక్ష మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఐరోపా కూటమిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీ ఈ దెబ్బతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఏప్రిల్ మధ్య వరకు షట్‌డౌన్ కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మే చివరి వారం వరకు అక్కడ దుకాణాలు తెరిచే పరిస్థితి కనిపించడమే లేదు.
‘మా దేశాన్ని రక్షించుకోవాలంటే మేమంతా ఇళ్లకు పరిమితం అవ్వడమే మార్గం. మా కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్న సిబ్బంది కోసం మేమిది చేయాల్సిందే’ అని రోమ్ మేయర్ అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు.