నేడు జరగనున్న ఏడు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల కూటమి జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ ఆర్థిక మాంద్యం, పర్యావరణ మార్పులు ప్రధాన అజెండాగా మారనున్నాయని అంచనా. ప్రపంచ ఆర్థిక వృద్ధి రోజు రోజుకు క్షీణిస్తోంది. పర్యావరణానికి కేంద్ర బిందువుగా ఉన్న అమెజాన్ అడవులు కార్చిచ్చుతో దగ్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు పరిష్కారం దిశగా జీ-7 దేశాధినేతలు అడుగులు వేస్తారనే అంచనాలు ఉన్నాయి.
గతేడాది జరిగిన జీ-7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగానే నిష్క్రమించారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి తుది ప్రకటన చేశారు. ఈసారి అలాంటిది జరగదని ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ భావిస్తున్నారు. అయినప్పటికీ.. ఈ సమావేశంలో సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ఒప్పందాలపై ట్రంప్ పెద్దగా ఆసక్తి కనబరచకపోవచ్చన్నది విశ్లేషకుల మాట.
ఈ సమావేశంలో వాతావరణ మార్పులపై డొనాల్డ్ ట్రంప్ ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందని మెక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు కారణంగా ఇదే అంశం ప్రధాన అజెండా అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
వాణిజ్యం, ఇరాన్, పర్యావరణ మార్పుల సమస్యలతో ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగా ఉన్నా... తొలిసారి సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో లేవని వారం రోజుల క్రితం మెక్రాన్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: భారత్-పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ద్విముఖ వ్యూహం!