మిడతల దాడులు భారత్ సహా తూర్పు ఆఫ్రికా, పాకిస్థాన్ దేశాల్లో ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల ఫలితంగానే మిడతల దాడులు ఎక్కువయ్యాయన్న డబ్ల్యూఎంఓ ... దీనికి మానవ కార్యకలాపాలే ప్రధాన కారణమని పేర్కొంది. వాతావరణ మార్పులు, ఎడారి ప్రాంతాల్లో ఉష్ణొగ్రత, వర్షపాతం పెరుగుదల, ఉష్ణమండల తుపానులు, మిడతల ప్రత్యుత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయని తెలిపింది. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లోని పంటలపై మిడతలు దాడి చేసి అపార నష్టం కలిగించాయి. తూర్పు ఆఫ్రికా దేశాల్లోనూ ఈ ఎడారి పురుగులు పెద్దఎత్తున పంట నష్టం కలిగించినట్లు డబ్ల్యూఎంఓ వివరించింది.
ఇతర దేశాల్లోనూ....
ఇథియోపియాలో... డిసెంబర్ 2019 నుంచి మార్చి 2020 మధ్య లక్షా 14 వేల హెక్టార్ల పంట నష్టం సంభవించినట్లు వాతావరణ సంస్థ అంచనా వేసింది. కెన్యా, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాల్లోనూ మిడతలు ఇదే స్థాయిలో పచ్చదనాన్ని ధ్వంసం చేస్తున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది.
ఇదీ చూడండి:దేశంలో 28 వేలు దాటిన కరోనా మరణాలు