కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న వేళ వైరస్‌ను నియంత్రించేందుకు బ్రిటన్‌లో రెండోసారి లాక్డౌన్ విధిస్తూ అక్కడి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన విడుదల చేశారు. వచ్చే గురువారం నుంచి నాలుగు వారాల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని బోరిస్ ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకోకపోతే మొదటిసారి కన్నా ఎక్కువ మరణాల సంభవించే అవకాశం ఉందన్నారు. వైరస్‌ను నియంత్రించాలంటే లాక్‌డౌనే శరణ్యమని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"క్రిస్మస్ పండుగకు ముందు లాక్డౌన్ ఎత్తివేసేలా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. అయినా, 2021 ప్రారంభం వరకు పరిస్థితిలో పెద్ద మార్పులు ఆశించవద్దు. వచ్చే ఏడాది వసంతకాలం నాటికి అంతా సర్దుకుంటుంది. అందరూ ఇంట్లోనే ఉండండి. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం సాధ్యం కాకపోతేనే ఇంటి నుంచి బయటకు రండి. ఇది చర్యలు తీసుకోవాల్సిన సమయం. దీనికి ప్రత్యామ్నాయం లేదు."
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
అత్యవసరం కాని దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు ఈ ఆంక్షల పరిధిలోకి రానున్నాయి. తొలి లాక్డౌన్ మాదిరిగా సంపూర్ణ నిషేధం విధించకుండా.. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తెరిచే ఉంచింది ప్రభుత్వం. తాజా లాక్డౌన్ ప్రణాళికలు.. వచ్చే వారం బ్రిటన్ పార్లమెంటు ముందుకు వెళ్లనుండగా గురువారం నుంచే అమలులోకి రానున్నాయి.
మరో ఐరోపా దేశంలో
పోర్చుగల్ సైతం లాక్డౌన్ బాటలోనే పయనించింది. నవంబర్ 4 నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉద్యోగాలు, పాఠశాలలు, అత్యవసరాలకు మినహా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంస్థలు అన్నీ రిమోట్ పద్ధతిలో పనిచేయాలని సూచించింది.
ఆస్ట్రియాలో తాత్కాలిక ఆంక్షలు
ఆస్ట్రియా మరోసారి లాక్డౌన్ బాట పట్టింది. వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న వేళ.. మంగళవారం నుంచి తాత్కాలిక ఆంక్షలు అమలులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రెస్టారెంట్లు, బార్లు, వినోద కార్యక్రమాలపై నిషేధం విధించింది. రాత్రి పూట కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది.
రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఆస్ట్రియా ఛాన్స్లర్ సెబాస్టియన్ కర్జ్ అభ్యర్థించారు. నవంబర్ మొత్తం ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.