బ్రిటన్లో ఉన్నత విద్య పూర్తిచేయాలని కలలుకనే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వ తీపికబురు చెప్పింది. కోర్సు పూర్తయిన తర్వాత ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ల మేరకు రెండేళ్ల వర్క్ వీసా (పోస్ట్ స్టడీ వర్క్ వీసా)ను ప్రకటించింది. దీని ద్వారా బ్రిటన్ విశ్వవిద్యాలయాలను ఎంచుకునే భారత విద్యార్థుల సంఖ్య పెరగనుంది.
వచ్చే ఏడాది నుంచి..
ఈ కొత్త నిబంధనలు 2020-21 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆమోదం పొందిన ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం డిగ్రీ, ఆ పైన చదువుతున్న విద్యార్థులు... కోర్సును పూర్తి చేసి, చెల్లుబాటు అయ్యే విద్యార్థి వీసా కలిగి ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఈ వీసా ద్వారా అర్హత కలిగిన విద్యార్థులు రెండేళ్ల పాటు వారికి నచ్చిన రంగంలో పని చేసేందుకు, ఉద్యోగం వెతుక్కునేందుకు వీలు కల్పిస్తోంది.
ఏడేళ్ల తర్వాత...
బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే యూకే హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2012లో ఈ వీసాను నిలిపివేశారు. ప్రస్తుతం ఆమె స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్ జాన్సస్ తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయం యూకేలో కెరీర్ను ప్రారంభించాలన్న విద్యార్థులకు మార్గం సుగమం చేస్తుందన్నారు బోరిస్.
స్వాగతించిన విద్యాసంస్థలు
ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ఉన్నత విద్యాసంస్థల అధిపతులు, ప్రతినిధులు స్వాగతించారు. డిగ్రీ చివర్లో కొంత పని అనుభవాన్ని పొందగలిగే సామర్థ్యం ఆధారంగా భారతీయ విద్యార్థులు వారి ఉన్నత విద్యాభ్యాసానికి యూకేను ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్రిటన్లో చదివిన సుమారు 82 శాతం మంది భారతీయ విద్యార్థులు వారి వృత్తి జీవితంలో సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. డిగ్రీ పూర్తయిన తర్వాత కొంత సమయం ఇక్కడే ఉండే అవకాశం విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.
42 శాతం పెరిగిన భారతీయుల సంఖ్య
గత మూడేళ్లుగా యూకే వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2018 జూన్లో వీసా కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య 22000, అది అంతకు ముందటి ఏడాదితో పోల్చితే సుమారు 42 శాతం అధికంగా ఉంది. బ్రిటన్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్య మరింత పెరగనుంది.
ఇదీ చూడండి: పాకిస్థానీ ఉగ్రసంస్థలపై ట్రంప్ సర్కార్ గురి