మనదేశంతో పాటు అనేక దేశాల్లో కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ టీకాల సామర్థ్యం ఎంతకాలం వరకు ఉంటుందో? ఇప్పుడు తెలుసుకుందాం.
ముందున్న మోడెర్నా
కొవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలోనే 'మేం కరోనా వాక్సిన్ తయారీ తుది దశలో ఉన్నాం' అని ప్రకటించి ప్రపంచానికి ఒక ఆశాదీపంలా మారిన సంస్థ మోడెర్నా. ఈ ఔషధ కంపెనీ అభివృద్ధి పరిచిన ఎంఆర్‌ఎన్‌ఏతో కరోనాని జయించగలం అని మానవాళికి ధైర్యం కలిగింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫాన్ బాన్సెల్ మాటల్లో చెప్పాలంటే 'మా టీకా తీసుకున్న వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు వేగంగా ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి నిర్వీర్యం కావడం చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఈ యాంటీబాడీలకు కనీసం రెండేళ్లు కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది'.
కొవిషీల్డ్ కథేంటి?
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన 'అడెనోవైరస్' వాక్సిన్‌ని భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా ప్రభుత్వం నుంచి అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం పొందింది. ఈ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముఖ్య పరిశోధకురాలు ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ చెబుతున్న దాని ప్రకారం.. ప్రాథమికంగా కొందరిపై ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు బేరీజు వేశాక ఈ టీకా రెండు డోసులు వాడితే కొన్నేళ్లపాటు కరోనా దరి చేరదు. మనిషి శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే రోగ నిరోధకశక్తి కన్నా వాక్సిన్ ఎన్నోరెట్లు ప్రభావవంతంగా పని చేస్తుంది అన్నారామె.
ఫైజర్ ఏమంటోంది?
అత్యవసర వినియోగానికి బ్రిటన్‌లో అనుమతి పొందిన తొలి టీకా ఫైజర్ బయోన్‌టెక్. తర్వాత అమెరికా, ఇతర దేశాల్లోనూ అనుమతించారు. ప్రయోగ దశల్లో వచ్చిన ఫలితాల ప్రకారం ఫైజర్-బయోఎన్‌టెక్ వాక్సిన్ రెండో డోసు వాడిన 85 రోజుల తర్వాత సైతం వ్యక్తి శరీరంలో కరోనాపై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలు ఉండటం గమనించారు. ఈ టీకా కొవిడ్‌తోపాటు సార్స్‌ని సైతం సమర్థంగా ఎదుర్కొంటోంది అంటోంది ఫైజర్.
తెలుగు సంస్థ సత్తా ఏడాది
మన తెలుగువారి కంపెనీ భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతి పొందింది. ఈ టీకా సామర్థ్యంపై డీసీజీఐ నమ్మకం ఉంచింది. భారత్ బయోటెక్ తాజాగా విడుదల చేసిన పరిశోధక పత్రంలో మేం రూపొందించిన టీకాతో ఒక మనిషి శరీరంలో యాంటీబాడీలు ఆరునెలల నుంచి ఏడాది పాటు ఉంటాయని ప్రకటించింది.
రెండేళ్ల స్ఫుత్నిక్
టీకాల వాడకానికి సాంకేతికంగా అన్నిరకాల అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి టీకా రష్యా కంపెనీ తయారు చేసిన స్ఫుత్నిక్. అక్కడ ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది ఈ టీకా తీసుకున్నారు. గమాలియా ఇన్‌స్టిట్యూట్ అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ ఇస్తున్న భరోసా ఏంటంటే స్పుత్నిక్ వీ టీకా రెండు డోసులు తీసుకుంటే కరోనా నుంచి రెండేళ్ల వరకు నిశ్చింతగా ఉండొచ్చు.
ఇదీ చూడండి:టీకా పంపిణీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా?