జర్మనీ రాజధాని బెర్లిన్లో నిర్వహిస్తున్న పెయింటింగ్ ఎగ్జిబిషన్ కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటలీకి చెందిన ఇద్దరు ప్రముఖ చిత్రకారులు మాంటెగ్నా, గియోవెన్నీ బెల్లీనీల మధ్య పోటీగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
వీరిరువురూ బంధువులు కావడం విశేషం. మాంటెగ్నా, గియోవెన్నీ సోదరిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కళారాధకులు కావడం వల్ల తమ చిత్రాలను జీవం ఉట్టిపడేలా రూపొందించారు.
"బెల్లినీ రంగులు వేయడంతో దిట్ట. ప్రకృతి దృశ్యాలు మలచడంలో అతనికతడే సాటి. అతని చిత్రాల్లో కరుణ కనిపిస్తుంది. మాంటెగ్నా చాలా సునిశిత దృష్టితో విశ్లేషణాత్మకంగా చిత్రాలు రూపొందిస్తారు. చక్కని పొందికతో తీర్చిదిద్దిన ఆ చిత్రాలు చూడడానికి ఎంతో బాగుంటాయి."
_ మైకేల్, 'జెమ్ లిడెగాల్రె' డైరెక్టర్
మాంటెగ్నా గీసిన 'జీసస్ క్రైస్ట్', గియోవెన్నీ చేతి నుంచి జాలువారిన 'ఇద్దరు దేవదూతల మధ్య జీసస్ క్రైస్ట్' చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. ఇవే కాకుండా ఈ ఇరువురు రూపొందించిన పలు చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.