అమెజాన్ అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చుపై జీ-7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంటలను అదుపుచేయడానికి బ్రెజిల్‌కు సహాయం చేయాలని ముక్తకంఠంతో నిర్ణయించాయి. ఈ మేరకు జీ-7 దేశాల నాయకులు... బ్రెజిల్‌కు ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు ఓ ఒప్పందాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ వెల్లడించారు.
'అండగా నిలుస్తాం'
బ్రెజిల్లో అటవీ పునరుద్ధరణకు జర్మనీ సహా ప్రపంచదేశాలు తోడ్పడతాయని ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. కార్చిచ్చును నియంత్రించడానికి బొల్సొనారో తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
పోప్ ప్రార్థన
తన స్వస్థలమైన అర్జెంటీనాకు పొరుగునే ఉన్న బ్రెజిల్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగడంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. మంటలను వీలైనంత త్వరగా నియంత్రించాలని.. అందుకోసం ప్రజలు ప్రార్థించాలని కోరారు.
'సాయాన్ని అంగీకరిస్తున్నా..'
ప్రపంచదేశాల సహాయాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు స్వాగితించారు. మంటలను అదుపుచేసేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు చెప్పినట్టు బొల్సొనారో ట్వీట్ చేశారు. అలాగే స్పెయిన్, చిలీ, పెరుగ్వే దేశాల సాయాన్నీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే కార్చిచ్చును అదుపుచేసేందుకు 44 వేల మంది సైనికులను వియోగించినట్లు బొల్సొనారో స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు