జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. అగ్రదేశాధినేతల భేటీకి ఫ్రెంచ్ తీరప్రాంత నగరం బియారిట్జ్ వేదికైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు, ఇటలీ, కెనడా, జర్మనీ, జపాన్ దేశాధినేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా.. క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లఘించిందని జపాన్ ప్రధాని షింజో అబే మిత్ర దేశాలకు తెలిపారు.
అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టివేస్తాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ ఇదివరకే హెచ్చరించారు. ఆర్థిక పురోగతికి వాణిజ్య ఒప్పందాలు బాటలు వేస్తాయని జీ 7 దేశాలకు సూచించారు. ఈ నేపథ్యంలో పలు దేశాధినేతలు ప్రత్యేక భేటీల్లో పాల్గొన్నారు.
ట్రంప్-బోరిస్ భేటీ
బ్రెగ్జిట్ తర్వాత అమెరికాతో కుదుర్చుకోవాల్సిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు బోరిస్. ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య సమస్యలను తొలగించేందుకు వర్కింగ్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
జపాన్‌తో ఒప్పందాలకు వేళైంది
జీ7లో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అతి త్వరలోనే జపాన్‌తో ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
ఇరాన్, ఉత్తర కొరియా దేశాలతో అమెరికా, జపాన్ సత్సంబంధాలపైనా ఇరువురు నేతలు చర్చించారు.