Future Pandemics: కొవిడ్-19 కంటే భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చట. అందుకే కరోనా నేర్పించిన పాఠాలను వృథా కానీయకుండా, మరో విజృంభణకు ప్రపంచం సిద్ధంగా ఉందని నిర్ధరించుకోవాలి. ఈ మాటలన్నది ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనికా టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్.
next pandemic will be:
'భవిష్యత్తులో వచ్చే మహమ్మారి మరింత దారుణంగా ఉంటుందన్నది వాస్తవం. అది వేగంగా ప్రబలే అవకాశమూ ఉంది లేక ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. లేకపోతే ఈ రెండు లక్షణాలతోనూ విజృంభిచవచ్చు. వైరస్ మన జీవితాలు, జీవనోపాధిని దెబ్బతీయడం ఇదే చివరిసారి కాదు. దీన్ని దృష్టిలోపెట్టుకొని మనం సాధించిన ప్రగతి, విజ్ఞానం కోల్పోకూడదు' అని గిల్బర్ట్ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు.
అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి మాట్లాడుతూ.. దాని స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనాలున్నాయని చెప్పారు. ఆ వేరియంట్ గురించి, టీకాలను ఏమార్చే సామర్థ్యం గురించి మరింత సమాచారం తెలుసుకునే వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రెండేళ్ల విలయం..
దాదాపు రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయం సృష్టిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. 26.6 కోట్లకుపైగా కరోనా కేసులు.. 52.7 లక్షల మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో వైద్య సేవలు అందక ఎంతో మంది విలవిల్లాడారు. ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పలు రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. దాంతో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని ఈ ప్రపంచం ఎదురుచూస్తోంది..!
ఇంకోపక్క ధనిక-పేద దేశాల మధ్య అంతరాయం స్పష్టంగా కనిపించింది. కొన్ని దేశాలకు టీకా పంపిణీ సరిగా జరగనేలేదు.. ధనిక దేశాలు మాత్రం బూస్టర్లు ఇస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన నిపుణుల బృందం పలు సూచనలు చేసింది. శాశ్వత నిధుల అందుబాటు, మహమ్మారి గురించి పూర్తి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించింది.
ఇదీ చదవండి: