కరోనా మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన రాత్రి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు కొందరు. కొవిడ్ వైరస్ విజృంభిస్తున్నా 2500 మందికిపైగా ఈ పార్టీలో పాల్గొనటం గమనార్హం. ఏకంగా 36 గంటల పాటు సాగిన ఈ పార్టీకి పోలీసుల రాకతో ముగింపు పలికినట్లయింది.
ఈ సంఘటన ఫ్రాన్స్ బ్రిటనీ ప్రాంతంలోని లియురాన్లో జరిగింది. కొందరు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయక గత గురువారం రాత్రి న్యూ ఇయర్ రేవ్ పార్టీని నిర్వహించారు. ఇందులో స్థానికులతో పాటు విదేశీయులూ పాల్గొన్నారు.
రహస్యంగా అండర్‌గ్రౌండ్‌లో పార్టీ నిర్వహించిన వారిని గుర్తించి, వారిపై చర్యలు చేపట్టేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి జెరాల్డ్ డర్మానిన్. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించటం, మాస్క్‌లు ధరించకపోవటం, అక్రమంగా పార్టీలో పాల్గొనటం వంటి కారణాలతో 1,200 మందికిపైగా జరిమానా విధించినట్లు చెప్పారు. పార్టీలో వినియోగించిన సంగీత సామగ్రి, విద్యుత్తు జనరేటర్‌ను జప్తు చేసినట్లు వెల్లడించారు.
పోలీసులుపై దాడి
విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులపై పార్టీలో పాల్గొన్న కొందరు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఓ పోలీసు వాహనానికి నిప్పుపెట్టారని, మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేయటం వల్ల కొందరు అధికారులు గాయపడినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ప్రపంచాన్ని చుట్టేస్తోన్న కరోనా స్ట్రెయిన్