ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని స్వీకరించారు అబీ. నార్వే రాజకుటుంబం సహా ఇతర ప్రముఖులు ఈ అవార్డు ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రపంచం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు అబీ అహ్మద్.
తన పొరుగుదేశం ఎరిట్రియాతో శాంతి నెలకొనేందుకు చేసిన కృషికి గానూ నోబెల్ శాంతి అవార్డు ఆయనను వరించింది. 1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధం తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు రెండు దేశాల మధ్య కొనసాగిన సైనిక ఉద్రిక్తతలకు గతేడాది ముగింపు పలికారు అహ్మద్. ఎరిట్రియాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇథియోపియా.
పురస్కారం కింద అహ్మద్‌కు పురస్కార పత్రం, బంగారు పతాకంతో పాటు దాదాపు రూ. 6.48 కోట్ల నగదు బహుమానం అందజేశారు.
వందో శాంతి పురస్కారం
ఈసారి శాంతి పురస్కారానికి 223 మంది వ్యక్తులతోపాటు 78 సంస్థలు నామినేట్ కాగా అవార్డు మాత్రం ఇథియోపియా ప్రధానిని వరించిది. తాజా నోబెల్... వందో శాంతి పురస్కారం కావడం వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం