బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్పార్టీతో, ప్రధాని థెరిసామే జరుపుతోన్న కీలక 'క్రాస్ పార్టీ బ్రెగ్జిట్ చర్చల' నుంచి ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే తప్పుకుంటున్నట్లు లేబర్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. తమ మధ్య చర్చలు సాధ్యమైనంత వరకు ముందుకు సాగాయని వ్యాఖ్యానించింది.
లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బైన్ చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రధాని థెరిసా మే కి లేఖ రాశారు. ప్రభుత్వం బలహీన, అస్థిరత్వ నాయకత్వంతో సతమతమవుతోందని ఎద్దేవా చేశారు.
"నేను థెరిసా మే కి లేఖ రాశాను. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో జరుగుతోన్న రాజీ చర్చలు పోవాల్సినంత దూరం పోయాయి అని చెప్పాను."- జెరెమీ కార్బైన్, లేబర్ పార్టీ నేత
థెరిసా మే ఘాటు స్పందన
జెరెమీ వ్యాఖ్యలపై ప్రధాని థెరిసా మే ఘాటుగా స్పందించారు. లేబర్‌పార్టీ రెండో రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ)లో సొంత ర్యాంకుల్లోనూ కనీసం 'సాధారణ స్థానం' పొందలేకపోయిందని దుయ్యబట్టారు.
ఐరోపా సమాఖ్యతో బ్రిటన్ 'కామన్ కస్టమ్స్ అరెంజ్మెంట్' చేసుకోవడానికి లేబర్ పార్టీ అనుకూలంగా ఉంది. అలా అయితేనే ఈయూ నుంచి వైదొలిగిన తర్వాత కూడా మిగతా యూరోపియన్ దేశాలతో వాణిజ్య పన్నుల విషయంలో సమస్యలు రాకుండా ఉంటాయని ఆ పార్టీ భావిస్తోంది.
స్వపక్షం ఒత్తిడితోనే...
థెరిసా మే జూన్ నెలలో ప్రధానమంత్రి పీఠం నుంచి వైదొలగనున్నారు. స్వపక్షం నుంచి వస్తోన్న ఒత్తిళ్లతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రతిపక్షంతో జరుపుతోన్న చర్చలు విఫలం కావడం గమనార్హం.
28 దేశాల కూటమైన ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉద్దేశించినదే బ్రెగ్జిట్ ఒప్పందం. అయితే దాని గడువు మార్చి 29 నుంచి అక్టోబర్ 31 వరకు పొడిగించారు.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియాలో అధికార మార్పిడి ఖాయమా?