ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్ వద్దని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. బ్రెగ్జిట్ గడువును పెంచేందుకు ఐరోపా సమాఖ్యతో చర్చలు జరపాలని మెజారిటీ బ్రిటిష్ ఎంపీలు నిర్ణయించారు. ఇందుకు బ్రిటన్ పార్లమెంటులో చట్టం తీసుకొచ్చారు.
ఈ చట్టంపై ముందునుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం... ప్రతిపక్షం తీరును తప్పుబట్టింది. ఐరోపా సమాఖ్యతో చర్చలను ప్రభావితం చేసేలా ఈ చట్టం ఉందని విమర్శించింది.
ఈ చట్టం మూలంగా బుధవారం ఐరోపా సమాఖ్య సదస్సులో బ్రెగ్జిట్‌కు గడువు కోరుతామని... పార్లమెంట్ ముందు ప్రభుత్వం మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టడం తప్పనిసరైంది. పార్లమెంటులో ఓటింగ్ సమయంలో గడువు పెంపుపై ఎంపీల సలహాలు సూచనలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుంది.
ఐరోపా సమాఖ్య నుంచి మే22న బ్రిటన్ అధికారికంగా వైదొలగాల్సి ఉంది. జూన్ 30 వరకూ పెంచాలని ప్రధాని థెరిసా మే ఈయూను ఇప్పటికే కోరారు. ఒప్పంద గడువు పెంపుపై తుది నిర్ణయం ఐరోపా సమాఖ్య చేతుల్లోనే ఉంది.
శుక్రవారం గడువు ముగిస్తే నో డీల్ బ్రెగ్జిట్‌ను ఈ చట్టం నిరోధించలేదు. బ్రిటన్, ఐరోపా సమాఖ్య గడువు పెంపునకు అంగీకరించలేకపోతే... చట్టపరంగా సమస్యలు ఎదురవుతాయి. బుధవారం చర్చల తర్వాత ఒప్పంద గడువును ఈయూ పెంచకపోతే బ్రిటన్ ఎలాంటి ఒప్పందం లేకుండానే వైదొగలక తప్పదు. ఆర్టికల్ 50ని రద్దుచేసి బ్రెగ్జిట్ ఒప్పంద ప్రక్రియను పూర్తిగా నిలిపివేసే అవకాశమూ బ్రిటన్‌కు ఉంది.