కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి బ్రిటన్ ప్రభుత్వం సోమవారం నుంచి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. వీటి ప్రకారం.. కరోనా సోకిన వారు స్వీయ క్వారంటైన్‌లో ఉండాల్సిందే. లేకుంటే వెయ్యి పౌండ్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆ జరిమానా 10వేల పౌండ్ల(సుమారు రూ.9.5 లక్షల)కు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కఠిన నిబంధనలు అవసరమయ్యాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
"ప్రాణాలు కాపాడటానికి ఈ చర్యలు అవసరం. ఈ అంశంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా పాజిటివ్‌గా తేలిన సందర్భాల్లో, కొవిడ్ బాధితులకు దగ్గరగా వెళ్లినట్లు వెల్లడైనప్పుడు.. తప్పనిసరిగా స్వీయ క్వారంటైన్‌లోకి వెళ్లాలి. దీన్ని ఉల్లంఘించిన వారి విషయంలో పోలీసులు చర్యలు చేపడతారు. చట్టానికి కట్టుబడే పౌరులు ఎంతో శ్రమకోర్చి కరోనాపై సాధించిన విజయాలు.. అతికొద్ది మంది ఉల్లంఘనదారుల వల్ల నీరుగారిపోకుండా చూడటానికే వీటిని చేపడుతున్నాం" అని బ్రిటన్ హోం మంత్రి ప్రీతీ పటేల్ తెలిపారు. స్వీయ క్వారంటైన్‌లో ఉన్న ఉద్యోగులను ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేసే సంస్థలపై 10వేల పౌండ్ల జరిమానాను విధిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చూడండి:- పాఠశాలలు తెరిచారు- చిన్నారుల్లో కరోనా ప్రబలింది!