ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బ్రిటన్ ప్రతిపక్షాలు. వారిని శాంతింపచేసేందుకు చర్యలు చేపట్టారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే. నేడు బ్రిటన్ పార్లమెంటులో ఒప్పందంపై చర్చ జరగనున్న నేపథ్యంలో సభ్యులనుద్దేశించి ప్రకటన విడుదల చేశారు థెరిసా మే.
చట్టసభ్యులు లేవనెత్తిన లోపాల సవరణకు ఐరోపా సమాఖ్యతో చర్చలు జరిపినట్లు ప్రధాని థెరిసా మే ప్రకటించారు. ఒప్పందంలో మార్పులు చేయటానికి ఐరోపా సమాఖ్య నుంచి చట్టబద్ధమైన హామీ పొందినట్లు స్పష్టం చేశారు.
ఐరోపా సమాఖ్య నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి బ్రిటన్‌కు మార్చి 29 తుది గడువు.
చట్టానికి లోబడి మార్పులు చేసిన బ్రెగ్జిట్ ఒప్పందం సభ్యుల ముందుకు రానుంది. ఆ చర్చలో నేను మరిన్ని విషయాలు వివరిస్తాను. చట్టబద్ధ మార్పులు కావాలని ఎంపీలు కోరారు. దానికి అనుగుణంగానే సవరణలు చేశాం. అందరూ ఒకే తాటిపైకి వచ్చి బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదించి, బ్రిటన్ ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సిన సమయమిది.-థెరిసా మే,బ్రిటన్ ప్రధాని
ఒప్పందంలోని కొన్ని అంశాలపై చట్ట సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగినా ఐర్లాండ్‌తో సరిహద్దులు ఎప్పటిలానే తెరిచి ఉండాలని చట్ట సభ్యులు పట్టుబడుతున్నారు.
మే ప్రకటనపై బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న చట్ట సభ్యులు స్పందించారు. ఒప్పందంలో తాము డిమాండ్ చేసిన సవరణలు అన్ని ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఒప్పందంలో ఎలాంటి మార్పులు ఉండవని బ్రెగ్జిట్ బిల్లుకు మరోసారి తిరస్కరణ తప్పదని కొంతమంది చట్టసభ్యులు ట్వీట్ చేశారు.