ETV Bharat / international

లాంగ్​ కొవిడ్ సిండ్రోమ్​కు కారణమేంటంటే?

author img

By

Published : Aug 18, 2021, 5:18 AM IST

long covid syndrome
కరోనా లాంగ్​ కొవిడ్ సిండ్రోమ్​

కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో దీర్ఘకాలం పాటు వైరస్​ లక్షణాలు కనిపిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై పరిశోధన ఐర్లాండ్​ పరిశోధకులు పలు కారణాలను విశ్లేషించారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే లాంగ్‌ కొవిడ్‌తో బాధపడుతున్న వారి రక్తంలో గడ్డకట్టే కణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న తర్వాత కొందరిని దీర్ఘ కాలంపాటు లక్షణాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. వీటిని లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలుగా పరిగణిస్తున్న నిపుణులు.. ఇందుకు గల కారణాలను విశ్లేషించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొవిడ్‌ బాధితుల్లో రక్తం గడ్డకట్టడం దీర్ఘకాల లక్షణాలకు (Long Covid Symdrome) దారితీస్తున్నట్లు అనుమానిస్తున్నారు. లాంగ్​ కొవిడ్‌పై ఐర్లాండ్‌ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో పలు కారణాలను విశ్లేషించారు.

50 మంది బాధితులపై..

లాంగ్‌ కొవిడ్‌పై రాయల్‌ కాలేజ్‌ సర్జన్స్‌ ఇన్‌ ఐర్లాండ్‌ (RCSI) యూనివర్సిటీకి చెందిన నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 50మంది బాధితుల ఆరోగ్యాన్ని విశ్లేషించారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే లాంగ్‌ కొవిడ్‌తో బాధపడుతున్న వారి రక్తంలో గడ్డకట్టే కణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొవిడ్‌ బారినపడిన తర్వాత రక్తం గడ్డకట్టే లక్షణంతో ఆస్పత్రిలో చేరిన వారిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించాయని చెప్పారు. అంతేకాకుండా రక్తం గడ్డకట్టే మార్కర్లు ఎక్కువగా ఉండి ఇంటిలోనే కోలుకున్న వారిలోనూ లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

రక్తం గడ్డకట్టే వ్యవస్థ ప్రమేయంతోనే..

సాధారణంగా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గినప్పటికీ శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, అలసట, వ్యాయామం చేసే ఓపిక తగ్గడం వంటి లక్షణాలు కొన్ని వారాల నుంచి నెలల తరబడి వేధిస్తుంటే ఇలాంటి వాటిని లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే లక్షణాలు ఉన్నవారిలో లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌తో పాటు శారీరక సామర్థ్యం తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయని తాజా అధ్యయనంలో పరిశోధకులు తేచ్చారు. అయితే, రక్తంలో వాపునకు కారణమైన మార్కర్లు సాధారణ స్థాయికి పడిపోయినప్పటికీ లాంగ్‌ కొవిడ్‌ బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువగానే ఉందని చెప్పారు. అందువల్ల లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌లో రక్తం గడ్డకట్టే వ్యవస్థ ప్రమేయం ఉందని భావిస్తున్నట్లు ఆర్​సీఎస్​ఐకి చెందిన డాక్టర్‌ హెలెన్‌ ఫోగర్టీ పేర్కొన్నారు. ఏదైనా వ్యాధికి కచ్చితమైన చికిత్స అందించాలంటే ఆ వ్యాధికి మూలకారణాన్ని తెలుసుకోవడమే అతిముఖ్యమని ఆర్‌సీఎస్‌ఐ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఓడాన్నెల్‌ పేర్కొన్నారు. అందుకే వీటిపై అధ్యయనాలు కొనసాగించడం వల్ల ఉత్తమమైన సేవలు అందించవచ్చని సూచించారు.

డబ్ల్యూహెచ్​ఓ కూడా..

ఇదిలాఉంటే, 'పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ (Post Covid Syndrome) లేదా లాంగ్‌ కొవిడ్‌' అనేది వాస్తవమని.. దీనిని ఇప్పటికే నిర్ధరించుకున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్యే వెల్లడించింది. కానీ, ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని, వీటిపై అధ్యయనం చేసి పూర్తిగా నిర్వచించే పనిలో నిమగ్నమయ్యామని కొవిడ్‌-19పై డబ్ల్యూహెచ్​ఓ టెక్నికల్‌ విభాగాధిపతి మరియా వాన్‌ కేర్ఖోవ్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్‌నుంచి కోలుకున్న తర్వాత ఈ సమస్యలతో బాధపడడం ఆందోళన కలిగించే విషయమని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ మహమ్మారికి సంబంధించిన మిస్టరీ అంశాల్లో 'లాంగ్‌ కొవిడ్‌' ఒకటిగా మిగిలిపోయిందని అభిప్రాయపడ్డారు. అందుకే, వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా దుష్ప్రభావాలు ఉంటే వైద్యుల సహాయం తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు సూచించారు.

ఇదీ చూడండి: పెన్సిల్​ లెడ్​తో కరోనా పరీక్షలు- మరింత చౌకగా!

ఇదీ చూడండి: వుహాన్​లో కోటి మందికి కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.