Omicron New Variant ba 2: ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో కనిపిస్తున్న ఒమిక్రాన్‌లోని ఒక ఉపరకంపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. 'బీఏ.2'గా పిలిచే ఈ రకం కరోనా వైరస్.. మూల ఒమిక్రాన్ వేరియంట్ కన్నా చాప కింద నీరులా వ్యాపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని జన్యు లక్షణాల కారణంగా దీన్ని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం కావడమే ఇందుకు కారణం. మూల ఒమిక్రాన్ వేరియంట్ కన్నా ఇది ఒకటిన్నర రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం తేల్చింది.
ఇది ఎక్కడ వ్యాపించింది?
ఒమిక్రాన్ మూల వేరియంట్‌ను బీఏ.1గా పేర్కొంటున్నారు. ఆ శ్రేణిలో కొత్తగా బీఏ.2 పుట్టుకొచ్చింది. కరోనా వైరస్ డేటాను పంచుకోవడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక 'జీఐఎస్‌ఏఐడీ'లోకి ఈ ఉపరకానికి సంబంధించి 18వేలకుపైగా జన్యుక్రమాల వివరాలను అప్‌లోడ్ చేశారు. ఈ వేరియంట్ 54 దేశాల్లో ఉంది. ఆసియా, ఐరోపాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. డెన్మార్క్‌లో వేగంగా విస్తరించి, ప్రధాన వేరియంట్‌గా మారింది. దీనివల్ల అక్కడ కొవిడ్ తాజా ఉద్ధృతి.. ఊహించినదానికన్నా ఎక్కువకాలం కొనసాగుతుందని భావిస్తున్నారు.
కొత్త వెర్షన్ తీరు ఏమిటీ?
Omicron New Variant Symptoms:
• బీఏ.2లో అనేక ఉత్పరివర్తనాలు ఉన్నాయి. ఆ వైరస్ స్పైక్ ప్రొటీన్‌లోని 20 మార్పులు బీఏ.1లోనూ ఉన్నాయి. వీటికి తోడు కొత్త ఉపరకంలో అదనంగా కొన్ని జన్యు మార్పులు కనిపించాయి.
• ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బీఏ.1తో ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. వీరికి తిరిగి ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్థ్యం బీఏ.2కు ఉందా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ అలాంటివారికి ఈ కొత్త వేరియంట్‌తో ఇన్‌ఫెక్షన్ సోకినా.. తీవ్ర వ్యాధిగా మారకపోవచ్చని అంచనా వేస్తున్నారు. రెండు వెర్షన్ల మధ్య సారూప్యతలు ఉండటమే ఇందుకు కారణం.
• వ్యాక్సిన్ల సమర్థత.. రెండు వెర్షన్లపై దాదాపు ఒకేలా ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మూడో డోసు పొందిన రెండు వారాల తర్వాత.. బీఏ.2 వల్ల లక్షణాలతో కూడిన వ్యాధి బారినపడకుండా 70 శాతం రక్షణ లభిస్తోందని తెలిపారు. బీఏ.1 విషయంలో అది 63 శాతంగానే ఉందని తేల్చారు.
• బాధితులను ఆసుపత్రిపాల్జేసే విషయంలోనూ బీఏ.1, బీఏ.2 వేరియంట్ల మధ్య తేడాలేమీ లేవని డెన్మార్క్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ప్రస్తుత చికిత్స విధానాలు కొత్త ఉపరకంపై ఎలా పనిచేస్తాయన్నది అక్కడి పరిశోధకులు పరిశీలిస్తున్నారు.
ఆరోగ్య సంస్థలేం చెబుతున్నాయి?
ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వర్గీకరించింది. ప్రత్యేకించి బీఏ.2కు ఎలాంటి వర్గీకరణ ఇవ్వలేదు. ఒకవేళ ఈ ఉపరకాన్ని కూడా ఆందోళనకర వేరియంట్‌గా పరిగణిస్తే దానికి గ్రీక్ పేరు ఇచ్చే అవకాశం ఉంది. చాలా దేశాల్లో దీని వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాని తీరుతెన్నులు విప్పేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. మరోవైపు బీఏ.2ను పరిశీలనలో ఉంచాల్సిన వేరియంట్‌గా బ్రిటన్ వర్గీకరించింది.
గుర్తించడం ఎందుకు కష్టమవుతోంది?
ఒమిక్రాన్‌లోని మూల వెర్షన్‌లో నిర్దిష్ట జన్యు లక్షణాలు ఉన్నాయి. వాటి ఆధారంగా నిపుణులు.. పీసీఆర్ పరీక్ష నిర్వహించి, ఈ రకానికి డెల్టా వేరియంట్‌కు మధ్య వైరుధ్యాన్ని త్వరగా గుర్తిస్తున్నారు. అయితే బీఏ.2లో ఇలాంటి జన్యు లక్షణాలు లేకపోవడంవల్ల అది ఈ పరీక్షలో డెల్టా తరహాలోనే కనిపిస్తోంది.
సింగపూర్‌లో కలకలం
BA2 Omicron Variant News: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు చెందిన ఉప రకం 'బీఏ.2' సింగపూర్‌లో కలకలం రేపుతోంది. ఈనెల 25 నుంచి ఇంతవరకు ఈ రకం కేసులు 198 బయటపడ్డాయి. ఒమిక్రాన్ మూల వేరియంట్ (బీఏ.1) కంటే ఇది ఎక్కువ సాంక్రమికశక్తిని కలిగి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుల్లో 150 ఇతర దేశాల నుంచి వచ్చినవారి వల్ల, 48 స్థానికంగాను సంక్రమించినట్లు చెబుతున్నారు. సింగపూర్‌లో శుక్రవారం 5,554 కొత్త కేసులు నమోదు కాగా ముగ్గురు కొవిడ్‌తో మృతి చెందారు. కాగా అత్యధిక కేసుల్లో లక్షణాలు లేకపోవడం లేదా స్వల్ప లక్షణాలు కనిపిస్తుండటంతో ఆసుపత్రులపై ఒత్తిడి అంతగా ఉండటం లేదు. ప్రస్తుతం 600 మంది కొవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చేరగా.. వీరిలో 10 మంది మాత్రమే ఐసీయూల్లోనూ, మరో 46 మంది ఆక్సిజన్ సపోర్టుతోనూ చికిత్స పొందుతున్నారు. ఇంకా రోగులు పెరిగినప్పటికీ చికిత్సలు అందించగలమని అక్కడి ఆసుపత్రులు చెబుతున్నాయి.
వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Precautions To Variant ba 2: కరోనా మహమ్మారి మొదలయ్యాక ఇప్పటివరకూ పాటిస్తున్న జాగ్రత్తలనే బీఏ.2 విషయంలోనూ కొనసాగించాలని నిపుణులు చెబుతున్నారు. టీకాలు పొందాలని, మాస్కులు ధరించాలని, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. బీఏ.2 రాకను బట్టి.. కొవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదని స్పష్టమవుతోందని వారు తెలిపారు. అందరూ టీకాలు పొందేవరకూ కొత్త వేరియంట్ల ముప్పు పొంచే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
మహమ్మారి ముప్పు తొలగిపోలేదు :డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్
Omicron New Variant India: భారత్‌లో కొన్ని నగరాలు, రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తిని తగ్గించడంపైనా, నిర్ణీత కట్టడి చర్యలు అమలు చేయడంపైనా, జాగ్రత్తలు పాటించడంపైనా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. 'పీటీఐ' వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. కొవిడ్ ముప్పు నుంచి ఏ దేశమూ ఇంకా బయట పడలేదన్నారు. ఈమేరకు సామాజికపరమైన కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ పెంపు వంటి చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
కొవిడ్ 'ఎండమిక్' స్థాయికి చేరిందా?
omicron endemic stage: ఈ ప్రశ్నకు డాక్టర్ పూనమ్ సమాధానమిస్తూ.. "మనమంతా ఇప్పుడు మహమ్మారి కోరల్లోనే ఉన్నాం. వైరస్ వ్యాప్తిని అరికట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే దృష్టి పెట్టాలి. కొవిడ్ ఎండమిక్ స్థాయి ప్రారంభమైందంటే.. దానర్థం వైరస్ ఇక ఆందోళనకరంగా ఉండదని కాదు" అని ఆమె పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ మరింత ఎక్కువగా వ్యాప్తి చెందే రకమని.. ఇది ఊపిరితిత్తుల కంటే ఎగువ శ్వాసకోశ వ్యవస్థలోని కణాలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని చెప్పారు. ఇదే వ్యాప్తి పెరగడానికి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ నుంచి రక్షణకు బూస్టర్ డోసు అవసరమని అభిప్రాయపడ్డారు. తీవ్రస్థాయి ఇన్‌ఫెక్షన్ నుంచి, మరణాల ముప్పు నుంచి టీకాలు ప్రజలను కాపాడుతున్నాయని ఆమె పునరుద్ఘాటించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఆ దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్!