అఫ్గానిస్థాన్‌లో పౌరులపై హింస పెరిగిపోయిందని, గౌరవంగా జీవించే హక్కుకు రక్షణ ఉంటుందో లేదోనని అక్కడి పౌరులు భయపడుతున్నారని భారత్(India at UNHRC) ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గాన్‌కు సాయం అందించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలిలో అఫ్గాన్ అంశంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశం(UNHRC session on Afghanistan)లో మాట్లాడిన భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే(Indra Mani Pandey).. అఫ్గాన్‌లోని మహిళలు, చిన్నారులు, మైనారిటీల హక్కులను గౌరవించాలని పేర్కొన్నారు. పొరుగుదేశంగా అఫ్గాన్ పరిణామాలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతోందన్నారు.
అఫ్గాన్‌లో పరిణామాలు పొరుగుదేశాలకు ముప్పుగా పరిణమించకూడదని పాండే పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఆ దేశంలో పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆకాంక్షించారు. శాంతి భద్రతలు నెలకొంటేనే.. అఫ్గాన్‌లో సుస్థిరత సాధ్యమని అన్నారు.
"శాంతియుత, సుసంపన్న, ప్రగతిశీల అఫ్గానిస్థాన్ కోసం భారత్ ఎల్లప్పుడూ అండగా నిలబడింది. ప్రజల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపైనే ఇరుదేశాల సహస్రాబ్దాల స్నేహబంధం ఆధారపడి ఉంది. అఫ్గానిస్థాన్‌లోని మా మిత్రులకు సహాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే(India ready to assist Afghanistan) ఉంటుంది. శాంతి, సుస్థిరత సాధించేందుకు అఫ్గాన్ ప్రజలకు అంతర్జాతీయ సమాజం సంపూర్ణ మద్దతు అందించాలి."
-ఇంద్రమణి పాండే, ఐరాస మానవ హక్కుల మండలిలో భారత శాశ్వత ప్రతినిధి
అఫ్గాన్‌లో అందరి ప్రాతినిధ్యంతో కూడిన సంఘటిత వ్యవస్థ ఏర్పాటు అవుతుందని భారత్ ఆశిస్తున్నట్లు పాండే పేర్కొన్నారు. విస్తృత ప్రాతినిధ్యం ఉన్న వ్యవస్థకు.. ఆమోదయోగ్యత, చట్టబద్ధత ఉంటుందని వ్యాఖ్యానించారు.
కఠిన చర్యలకు పిలుపు
ఈ సమావేశంలో మాట్లాడిన ఐరాస మానవహక్కుల మండలి చీఫ్ మిషెల్ బాచ్లెట్(UNHRC Chief Michelle Bachelet).. తాలిబన్ ఆక్రమిత అఫ్గానిస్థాన్‌లో అనేక అకృత్యాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నివేదిక తమకు అందిందని తెలిపారు. పౌరులు, భద్రత బలగాల ఊచకోత సహా, మహిళలపై ఆంక్షలు విధించినట్లు తెలిసిందని చెప్పారు. అఫ్గాన్‌లో హక్కుల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలిలోని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. అఫ్గాన్ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, లేదంటే నిజ నిర్ధరణ మిషన్ చేపట్టాలని అన్నారు.
ఇదీ చదవండి: 'తాలిబన్లను నడిపిస్తోంది పాకిస్థానే'