కరోనా వైరస్ చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఇటలీ, ఇరాన్ సహా ఆయా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7100మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు. 1,83, 000మందికి పైగా వైరస్ బారినపడ్డారు. చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న ఇటలీలో శని, ఆదివారాల్లో 349మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 2158కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో పావు వంతు కేసులు ఇటలీలోనే నమోదయ్యాయి. మొత్తంగా ఆ దేశంలో 27, 980మందికి వైరస్ సోకింది.
ఇరాన్లో...
ఇరాన్లో తాజాగా 135మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 988కి చేరింది. ఇరాన్లో ఇప్పటివరకు 16, 169 మందికి కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.
పర్షియన్ నూతన ఏడాది నౌరోజ్ వేడుక సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇరాన్ ప్రజలు జంకుతున్నారు. నౌరోజ్ వేడుక సందర్భంగా టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించారు అధికారులు. చహర్షంబే సూరీగా పిలిచే ఈ నూతన ఏడాది వేడుకల సందర్భంగా ఎవరూ సామాజికంగా కలవకూడదని పిలుపునిచ్చింది ప్రభుత్వం.
వుహాన్‌లో ఒకే కేసు..
వైరస్ మొదటిసారిగా బయటపడిన చైనా వుహాన్‌లో తాజాగా ఒకే ఒక్క కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు.
స్పెయిన్‌లో...
కరోనా వైరస్ ప్రభావిత దేశాల్లో స్పెయిన్ ఒకటి. తాజాగా 2వేల కరోనా కేసులు నమోదయ్యాయని ప్రకటించింది స్పెయిన్. వైరస్ సోకిన వారి సంఖ్య 11, 178కి చేరింది. 491మంది ప్రాణాలు కోల్పోయారు. 1098మందికి కరోనా నయమయినట్లు సమాచారం.
కరోనా నేపథ్యంలో పోలాండ్ ప్రభుత్వ యంత్రాంగం స్వీయ నిర్బంధంలో ఉంది. ఓ మంత్రికి కరోనా సోకిందని తేలిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు.
అమెరికాలో..
అగ్రరాజ్యం అమెరికా కరోనాను అరికట్టే దిశగా తమ పౌరులకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వృద్ధులు బయటతిరగకూడదని సూచించింది. 10మంది కంటే ఎక్కువగా గుమికూడటంపై ఆంక్షలు విధించింది.
ఫ్రాన్స్‌లో..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఫ్రాన్స్ కూడా ఇటలీ తరహా విధానాన్ని అవలంబిస్తోంది. ఆహారం కొనుగోలు, పనికి వెళ్లేందుకు, అత్యవసరమైన వ్యవహారాల్లో సంచరించేందుకే అనుమతించింది.
బ్రిటన్‌లో..
కరోనా పట్ల జాగ్రత్త వహించాలని.. ఇతరులతో అనవసరంగా సన్నిహితంగా మెలగకూడదని సూచించారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. వర్క్ ఫ్రమ్ హోం కల్పించిన కారణంగా బయట తిరగకూడదని సూచించారు. రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లకు వెళ్లకూడదని తెలిపారు. రోజులో కొంత సమయం పాఠశాలలు పనిచేస్తాయని చెప్పారు.
ఈజిప్టులో..
ఆఫ్రికా దేశం ఈజిప్టులోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే 166 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని ఓ డెల్టా గ్రామంలో ఇద్దరు వృద్ధులు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా గ్రామానికి చెందిన 3వందల కుటుంబాలను నిర్బంధంలో ఉంచింది ప్రభుత్వం.
దక్షిణాఫ్రికాలో..
కరోనా వైరస్‌పై జాగ్రత్త వహించాలని తమ ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది దక్షిణాఫ్రికా కేంద్ర బ్యాంకు. బ్యాంకునోట్లు, నాణేలను మారుస్తామని తప్పుడు గుర్తింపు పత్రాలతో కొంతమంది ఇళ్లకు వచ్చే అవకాశం ఉందని.. వారిపట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. వారు అందించే నోట్లపై కరోనా వైరస్ ఉండవచ్చని పేర్కొంది.
విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది మలేసియా. కరోనాపై పోరాడేందుకు జర్మనీ.. 50 మిలియన్ యూరోలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: కర్ఫ్యూ, బంద్‌తో కరోనాపై ప్రపంచ దేశాల యుద్ధం