విల్లీ డాలీ... ఐర్లాండ్‌లో ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే పెళ్లి సంబంధాలు కుదర్చటంలో ఈయనది అందె వేసిన చేయి. డాలీ తన 50ఏళ్ల కెరీర్లో 3వేలకు పైగా వివాహాలను ఎంతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. డేటింగ్ యాప్స్, చరవాణిలో చాటింగ్ ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో... అనేక మంది తమ ప్రేమను వెతుక్కుంటూ ఈ పెళ్లిళ్ల పేరయ్య దగ్గరకు వెళ్తారు.
ప్రేమను వెతుక్కోవడానికి ఇక్కడకి వస్తూ ఉంటారు. తమతో పాటు ఎనలేనంత ప్రేమనూ తీసుకొస్తారు. ఆ ప్రేమను పంచుకోవడం కోసం ఒకరిని వెతుక్కుంటారు. ప్రేమ ఇవ్వడమే కాదు.. తిరిగి ఆ ప్రేమను పొందాలనుకుంటారు కూడా.
-విల్లీ డాలీ, పెళ్లిళ్ల పేరయ్య.
ఐర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల సంప్రదాయాల ప్రకారం... ఆస్తులన్నీ కుమారులకే దక్కుతాయి. దీని వల్ల ఆ ప్రాంత అమ్మాయిలు యూకే, అమెరికా వంటి ఇతర దేశాల వారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఫలితంగా అమ్మాయిల కొరత ఏర్పడింది.
డాలీ కుటుంబం 160 ఏళ్లుగా ఈ మ్యాచ్ మేకింగ్‌ను వృత్తిగా ఎంచుకుంది. వారసత్వంగా... వృత్తితో పాటు 'లక్కీ లవ్ బుక్' కూడా డాలి సొంతమైంది. ఈ పుస్తకంలో అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు డాలీ. ఇందులో ఎవరి పేరైనా రాస్తే.. ఆరు నెలల్లోగా వారికి తగిన జోడీ దొరుకుతుందని నమ్ముతారు.
ఈ మ్యాచ్ మేకింగ్ కోసం ఐర్లాండ్‌లోని లిస్డూన్వర్ణలో ఏటా సెప్టెంబర్‌లో ఉత్సవాలు జరుగుతాయి. ఐర్లాండ్ సహా ప్రపంచ నలుమూలల నుంచి తమ ప్రేమను వెతుక్కోవడం కోసం అనేక మంది ఇక్కడికి వస్తారు.
ఒకరి మధ్య ఒకరికి కెమిస్ట్రీ ఉండాలని డాలీ విశ్వసిస్తారు. అప్పుడే ప్రేమికుల జీవితం ఆనందంగా ఉంటుందని ఆయన నమ్మకం. పలు లక్షణాలను గుర్తించి, కొందరిని ఎంపిక చేసి.. వారి మధ్య కెమిస్ట్రీ ఉందో లేదోనని తెలుసుకోవాలని ప్రోత్సహిస్తారు. ఇవన్నీ ఈ వార్షిక ఉత్సవాల్లో భాగమే.
ఈ ఉత్సవాలకు ఏటా వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఇవి ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు సాగుతాయి. యువతి యువకులు కలిసి పాటలకు ఆహ్లాదంగా డాన్స్‌లు వేస్తారు. ఇలా డాన్స్‌లు వేయటం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి వీలు కలుగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడే ఒక్కటైన వారు కూడా ఈ వేడుకల్లో పాల్గొని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు.
ఈ ఉత్సవాలతో స్థానిక వ్యాపారులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఈ ఏడాది 40వేల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:- పచ్చని చిట్టి గువ్వా... నీ చిరునామా ఎక్కడ...?