భూమి.. మానవునికే కాదు... సమస్త జీవజాతులకు నివాసం. అలాంటి భూమిని మనం ఇష్టానుసారం వాడుకుంటున్నాం. విచ్చలవిడి వనరుల వాడకం, అడవుల నరికివేత, జంతుజాతులపై దాడి వంటి దుశ్చర్యలతో మానవజాతి ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి నెలకొంది.
ప్రకృతి సమతుల్యం దెబ్బతింటున్న తీరుపై 450 మంది నిపుణులు 1800 పేజీల నివేదిక తయారు చేశారు. ఇందుకోసం 15వేల ప్రదేశాల నుంచి సమాచారం సేకరించారు. ఇంతటి భారీ నివేదిక సారాంశాన్ని దేశాధినేతలకు అందిస్తున్నారు.
కేవలం పర్యావరణానికే కాకుండా.. ఆర్థికాభివృద్ధికి ఈ నివేదిక దోహద పడుతుందని కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు.
వేగంగా ముప్పు...
గత 10 మిలియన్ సంవత్సరాలుగా జీవజాతుల హనన వేగం 10 నుంచి 100 శాతం పెరిగిందని ఐరాస నిపుణుల బృందం లెక్కగట్టింది. 66 మిలియన్ ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసర్ల తర్వాత ఆ స్థాయిలో జీవజాతుల వినాశనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
"ప్రస్తుతం మానవులకు అంత ప్రమాదం లేదు. కానీ అనతి కాలంలో ఏం జరుగుతుందో చెప్పలేం. మానువులు ఇలానే ప్రవర్తిస్తే... ప్రకృతి తన దారి తాను చూసుకుంటుంది. ఈ పరిస్థితి మారాలంటే పూర్తి స్థాయి మార్పులు అవసరం. ఉత్పత్తి, వినియోగంలో ఈ మార్పులు జరగాలి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులపై ఈ మార్పు తప్పనిసరి."
- నివేదిక సారాంశం
గత అక్టోబర్లో ఐరాస ఇచ్చిన నివేదికలో భూతాపం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిపోతోన్న ఉష్టోగ్రతలను తగ్గించాలంటే సామాజిక మార్పు అవసరమని సూచించారు.
మొట్టమొదటిసారి ఐరాస అంతరించిపోతున్న జీవ జాతులకు గల కారణాలను తెలిపింది.
⦁ దేశాలు ఆహారపంటల దిగుబడి కోసం విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల వాటి ప్రభావానికిలోనై కీటక జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి.
⦁ కీటక జాతులు అంతరించిపోవడం వల్ల జీవగడియారం దెబ్బతిని వాటిపై ఆధారపడే జంతుజాలం సంఖ్య ఏటా తగ్గిపోతోంది.
⦁ సముద్రంలోని చేపల సంఖ్య 7% తగ్గిపోవడం. మనుగడ కోసం ప్రయత్నించే స్థాయికి పడిపోవడం.
⦁ భూతాపం కూడా ఇందుకు ఓ కారణమే.
⦁ అంతకంతకూ పెరిగిపోతోన్న కాలుష్యం, విషవాయువులు. కర్మాగారాల్లోని వృథా నీరు నదులు, సముద్రాల్లోకి పంపడం.
⦁ జనాభా పెరుగుదల, ఆహార వినియోగం.
జీవ వైవిధ్యంపై 2020 అక్టోబర్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ నివేదిక మార్గదర్శకంగా నిలవనుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
- ఇదీ చూడండి: సార్వత్రిక సమరం ఐదో దశ సమాప్తం