ప్రాణాంతక కరోనా వైరస్‌తో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది. వైరస్ కేంద్రబిందువైన చైనాతో సహా ప్రపంచ దేశాల్లోని అనేక పట్టణాలు, కార్యాలయాలు, పార్కులు నిర్మానుష్యంగా మారాయి. బడికి వెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులపైనా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతుండటం వల్ల దాదాపు 300 మిలియన్లు(30కోట్లు) మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని యునెస్కో వెల్లడించింది.
కరోనాతో పోరుకు అనేక దేశాలు అసాధారణమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది యునెస్కో. కానీ వీటి ప్రభావం 290.5 మిలియన్ల మంది పిల్లలపై పడిందని పేర్కొంది.
పాఠశాలల మూసివేత జాబితాలో తాజాగా ఇటలీ, భారత్ చేరాయి. ఇరాన్, జపాన్‌తో పాటు అనేక దేశాల్లో ఇప్పటికే విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇటలీని కరోనా కలవరపెడుతోంది. ఇప్పటివరకు 107మందిని బలితీసుకుంది. మరో 3వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా పాఠశాలలతో పాటు వర్సిటీలనూ మూసివేసింది ప్రభుత్వం. క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనొద్దని అభిమానులకు తేల్చిచెప్పింది.
ఫ్రాన్స్‌లో...
మరో ఐరోపా దేశం ఫ్రాన్స్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు కనపడుతున్నాయి. వైరస్ వల్ల ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. గురువారం ఒక్కరోజే 92 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 377కు చేరింది. దాదాపు 150 స్కూళ్లు మూతపడ్డాయి.
ప్రస్తుతం 80 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో తొలి మరణం నమోదైంది. మృతుడు ఇటలీలో పర్యటించి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. బ్రిటన్‌లోనూ తొలి మరణం సంభవించింది.
మక్కా వెలవెల...
మరోవైపు ముస్లింల పవిత్ర ప్రదేశమైన మక్కా.. భక్తులు లేక వెలవెలబోయింది. వైరస్ నేపథ్యంలో మక్కా చుట్టూ పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టిన సౌదీ అరేబియా ప్రభుత్వం. కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటం వల్ల ఏడాది పొడవునా సాగే ఉమ్రా యాత్రను ఇప్పటికే రద్దు చేసింది.