కొవిడ్-19కు కారణమవుతున్న సార్స్ కోవ్-2 జన్యువుల్లో ఏకంగా 198 వరకు మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 7,500 మంది రోగులపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తేల్చారు. ఇది వ్యాధి చికిత్స, టీకాల తయారీకి ఉపకరించనుంది.
'యూనివర్సిటీ కాలేజ్ లండన్' పరిశోధకులు సమర్పించిన ఈ పత్రాన్ని 'ది జర్నల్ ఇన్‌ఫెక్షన్'లో ప్రచురించారు. వీరు మనుషుల్లో వైరస్ ఎలా మనుగడ సాగిస్తోంది... దాని జన్యు లక్షణాలు తదితర అంశాలను పరిశీలించారు. వైరస్ ప్రభావిత అన్ని ప్రాంతాల్లో ఈ జన్యు మార్పులు కనిపించడం గమనార్హం. దాని జన్యుక్రమంలో వేర్వేరుగా మొత్తం 198 మార్పులను గుర్తించారు. అంటే... అది మానవుల కణాలకు అనుగుణంగా మారుతున్నట్లు అర్థమవుతోంది.
''వైరస్‌ల్లో మార్పులు చోటు చేసుకోవడం సహజం. సార్స్ కోవ్-2 వేగంగా మారుతోందా.. నెమ్మదిగా మారుతోందా తెలియడం లేదు. వైరస్ వేగంగా మారుతుంటే మాత్రం టీకాలు, మందులు ప్రభావవంతంగా పనిచేయవు. అందుకే వైరస్‌లో తక్కువ మార్పులు జరుగుతున్న భాగాలను గుర్తించి వాటికి తగినట్లుగా ఔషధాలను అభివృద్ధి చేస్తే అవి ఎక్కువకాలం పనిచేస్తాయి. వైరస్ తేలిగ్గా తప్పించుకోకుండా టీకాలు, ఔషధాలను అభివృద్ధి చేయాలి. మనం వైరస్‌లో మార్పులను మరింత నిశితంగా గమనించాల్సిన అవసరముంది' అని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ బల్లౌక్స్ తెలిపారు.