అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఇటీవల దౌత్యపరమైన చర్చలు జరిపిన నేపథ్యంలో చైనా, ఉత్తర కొరియా కీలక ప్రటన చేశాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సంప్రదాయబద్ధమైన సంబంధాలను గుర్తిస్తూ స్నేహగీతాన్ని ఆలపించాయి.
విరోధ శక్తులు విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు చైనాతో బలమైన కలిగి సహకారం ఉండాలని దక్షిణ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఈ మేరకు సందేశం పంపించారు. ప్రస్తుతం మారిపోతున్న బాహ్య పరిస్థితులకు, వాస్తవికతకు అనుగుణంగా జిన్‌పింగ్‌కు తనకు మధ్య సంప్రదింపులు ఉండాలని కిమ్ అభిప్రాయపడ్డారు.
సహకారిస్తాం: జిన్‌పింగ్
కిమ్‌కు ప్రతిసందేశం పంపిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను విలువైన ఆస్తిగా అభివర్ణించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వం కోసం అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. ఇరు దేశాల ప్రజలకు మెరుగైన జీవనం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
చైనా సీనియర్ దౌత్యవేత్త సోంగ్ టావో, చైనాలోని ఉత్తర కొరియా రాయబారి రి ర్యోంగ్ నామ్ మధ్య బీజింగ్‌లో జరిగిన సమావేశంలో ఈ సందేశాలను ఇచ్చిపుచ్చుకున్నారని కొరియా వార్తా సంస్థ తెలిపింది.
సాయం అదేనా?
అన్ని రకాలుగా సహకారం చేస్తామని చైనా ప్రకటించిన నేపథ్యంలో.. కరోనా సహా ఇతర ఆంక్షలతో అల్లాడుతున్న ఉత్తర కొరియాకు డ్రాగన్ దేశం కీలక సాయం చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల మూత వల్ల ఆహారం, ఎరువుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశానికి.. అవసరమైన సరకులు పంపించనుందని చెబుతున్నారు.
పర్యటనపై ఫైర్
ఇటీవలే దక్షిణ కొరియా, అమెరికా సైన్యాల సంయుక్త విన్యాసాలు జరిగాయి. అదే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దక్షిణ కొరియాలో పర్యటించారు. ఉత్తర కొరియా అంశం సహా ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. వీరి పర్యటనపై అప్పుడే అమెరికాకు హెచ్చరికలు పంపింది కిమ్ సర్కార్.
ఇదీ చదవండి: జో బైడెన్ సర్కార్‌కు 'కిమ్' తొలి హెచ్చరిక