నమస్తే ట్రంప్!... అమెరికా అధ్యక్షుడి భారత సందర్శనకు దిల్లీ పెద్దలు పెట్టిన పేరు. ఈనెల 24,25 తేదీల్లో అహ్మదాబాద్, దిల్లీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకన్నా ఎక్కువగా... ట్రంప్ పర్యటనతో కలిగే లాభాలపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? రక్షణ మైత్రి మరింత బలోపేతం అవుతుందా? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేలా ఏమైనా చర్యలుంటాయా? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం అధిక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థల్ని బేఖాతరు చేస్తూ... వేర్వేరు దేశాలతో ఆయన విభేదించి, ఒత్తిడి తెచ్చి, ఒప్పందాలు చేసుకున్న తీరే ఇందుకు కారణం. అలాంటి ట్రంప్... ఇప్పుడు భారత్ విషయంలో ఏం చేస్తారన్నది ఆసక్తికరం.
వ్యూహాత్మకమే కానీ...
అమెరికా-భారత్ ఎప్పుడూ తమను తాము వ్యూహాత్మక భాగస్వాములుగా పరిగణిస్తాయి. అయితే వాణిజ్యపరమైన అంశాలకు వచ్చేసరికి... రెండు దేశాలు పరస్పరం విభేదించుకుంటున్నాయి. పాడి పరిశ్రమ, వ్యవసాయం, సాంకేతికత వంటి అంశాల్లో ఈ దేశాల మధ్య పలు భేదాభిప్రాయాలు ఉన్నాయి.
అగ్రరాజ్యంతో భారత్ సంబంధాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. వాణిజ్యం, సాంకేతితక వంటి అంశాల్లో అమెరికాకు భారత్ అతిపెద్ద భాగస్వామి. 2014 సంవత్సరంలో ఇరుదేశాల మధ్య 182 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తకపోతే వచ్చే కొన్నేళ్లలో ఈ విలువ 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న విషయంలో అనుమానం లేదు.
వర్తకం విషయంలో రెండు దేశాలు పూర్తిస్థాయిలో సహకరించుకోవాలంటే అమెరికా- భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం అత్యావశ్యకం. ఈ విషయంలో ఆచరణాత్మక వైఖరి అవలంబించిన చైనా నుంచి మనం ఒకట్రెండు విషయాలు గ్రహించవచ్చు. రెండు దేశాలను ప్రభావితం చేసే వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం ద్వారానే అమెరికాతో వ్యూహాత్మక బంధాన్ని బలపరుచుకోవచ్చు.
డ్రాగన్‌కు మూకుతాడు
హిందూ, పసిఫిస్ మహా సముద్రాలలో చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఓ యంత్రాంగం రూపొందించడం కూడా ట్రంప్ పర్యటన అజెండాలో భాగంగా కనిపిస్తోంది. గతేడాది అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ సైతం... 'ఆసియా పసిఫిక్' బదులు 'ఇండో పసిఫిక్' అనే పదాన్నే ఈ ప్రాంతాన్ని సూచించేందుకు ఉపయోగించింది. ఈ చర్యతో ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతిభద్రతలను పరిరక్షించడంలో భారతదేశ ప్రాముఖ్యాన్ని సూచించినట్లయింది.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు సైతం చైనా దుందుడుకు ధోరణికి అడ్డుకట్ట వేసే కోణంలోనే చూడాలి. గతేడాది ఐక్యరాజ్య సమితి సమావేశాలలో భాగంగా ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో ఈ ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకే ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు ప్రపంచానికి సందేశం అందించారు.
చైనా పైపైకి..!
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అమెరికా అంతర్జాతీయంగా తన ప్రాభల్యాన్ని కోల్పోయింది. మరోవైపు ఆర్థికంగా, సైనిక సంపత్తిపరంగా అంతర్జాతీయ సమాజంలో చైనా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. భారత్ విషయంలో చైనా దూకుడు మరింత పెంచింది. మరిన్ని మార్గాల్లో తన కుటిలత్వాన్ని ప్రదర్శించింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం కూడా ఇందులో భాగమే. అంతేకాక పాకిస్థాన్, చైనా కలిసి భద్రత పరంగా భారత్‌కు సవాల్ విసురుతున్నాయన్న విషయం బహిరంగ రహస్యమే. అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యాన్ని చైనా ఎప్పటి నుంచో సవాలు చేస్తూ వస్తోంది.
చైనాకు వ్యతిరేకం కాకూడదు కానీ
ఈ నేపథ్యంలో భారత్ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాతో పాటు ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా వ్యతిరేక కూటమిలో భాగం కాకూడదు. కానీ చైనా దూకుడుకు దౌత్యపరమైన మార్గాల్లోనే సరైన జవాబు ఇవ్వడం ముఖ్యం. దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను సృష్టించి తన సైనిక శక్తిని డ్రాగన్ దేశం ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది. ఈ చర్యలు ప్రపంచాన్నంతటికీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
బలపడిన రక్షణ సహకారం
చైనా దూకుడును ప్రత్యక్షంగా ఎదుర్కొనే ఉద్దేశం అమెరికాకు లేదు. అందువల్ల హిందూ మహా సముద్రంలో భారత్ ముఖ్యపాత్ర పోషించాలని కోరుకుంటోంది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం, గత కొన్నేళ్లలో రెండు దేశాల సైనిక సహకారం మరింతగా పెరిగిన విషయం మనం గమనించవచ్చు. గత 12 ఏళ్లలో అమెరికా నుంచి 20 బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు వేళ్లూనుకున్నాయన్న విషయాన్ని ఇది ధ్రువీకరిస్తోంది.
పాకిస్థాన్ విషయంలో...
భారత్-అమెరికా మధ్య ఎప్పుడు భేటీ జరిగినా పాకిస్థాన్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. భారత్-పాక్ అంగీకరిస్తే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ట్రంప్ ఇప్పటికే చాలా సార్లు వ్యాఖ్యానించారు. అయితే భారత ప్రధాని మోదీ మాత్రం అందుకు ఆస్కారం లేదని తేల్చేశారు. ట్రంప్‌తో జరిగిన భేటీలోనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ఈ అంశం ట్రంప్ పర్యటన సందర్భంగా ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం.
భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోందన్న విషయంలో పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండటం మానుకోవాలని హితవు పలికింది.
పాక్ పర్యటన లేదు
ఉగ్రవాదంపై పోరాటం విషయంలోనూ భారత్-అమెరికా మధ్య సుదృఢ సంబంధాలు ఉన్నాయి. అయితే ఇవి మరింత బలపడాలి. మరోవైపు పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభించాలని ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించే అవకాశమూ ఉంది. కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి పాకిస్థాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరగడానికి అసలు అవకాశం లేదు. సాధారణంగా భారత పర్యటన తర్వాత అమెరికా అధ్యక్షులందరూ పాకిస్థాన్‌లో పర్యటించేవారు. కానీ ఈ సారి డొనాల్డ్ ట్రంప్ అలా చేయడంలేదు. తన పర్యటనకు అక్కడి వాతావరణం అనుకూలంగా లేదని పాకిస్థాన్‌కు సంకేతాలు ఇచ్చారు ట్రంప్.
(రచయిత-సురేష్ బాఫ్నా)