గాలి ద్వారా వ్యాప్తి చెందే క్రిముల నుంచి రక్షణ కల్పించడంలో మాస్క్‌ల పాత్ర కీలకం. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న కాలంలో చాలా దేశాలు ఈ ముఖ కవచాలను తప్పనిసరి చేస్తున్నాయి. 18వ శతాబ్దంలో ఆసుపత్రుల్లో వీటి వినియోగం ప్రారంభం కాగా.. 1919 స్పానిష్ ఫ్లూ విజృంభణ తర్వాత ప్రజలందరూ మాస్క్‌లు వాడటం మొదలుపెట్టారు. అయితే భారత్‌లోనూ ప్రస్తుతం సాధారణ ప్రజలు మాస్క్‌లతో కనిపిస్తున్నారు. ఈ తరహా విధానం మనకు కాస్త ఇబ్బందిగా ఉన్నా.. జపాన్ వాసులకు మాత్రం కొత్తేమి కాదట. వారు ఎన్నో ఎళ్లుగా ముఖానికి మాస్కు అందం, రక్షణ అనే విధానాన్ని పాటిస్తున్నారట. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అనారోగ్యంగా ఉంటే..
జలుబుతో బాధపడుతున్నప్పుడు తుమ్ము వస్తే.. మనం రుమాలు లేదా చేతిని అడ్డుపెట్టుకుంటాం. కానీ జపాన్ ప్రజలు జలుబు తగ్గే వరకు మాస్క్ ధరిస్తారు. అక్కడి ప్రజలు వ్యక్తిగతంగానే కాకుండా సమాజం విషయంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అందుకే వారి వల్ల ఇతరులకు జలుబు రాకూడదని జాగ్రత్త వహిస్తారు. ఏ కొంచెం అనారోగ్యానికి గురైనా మాస్క్ తప్పనిసరిగా ధరిస్తారు.
వసంతకాలంలో డేంజర్..
వసంతకాలంలో చెట్లు చిగురించి పూలు పూస్తాయి. ఆ పూల పుప్పొడి రేణువులు గాలిలో కలవడం వల్ల జపాన్‌లో అనేక మంది అలెర్జీకి గురవుతుంటారు. దీని నుంచి తప్పించుకునేందుకు అక్కడి వాళ్లు మాస్క్‌ను ధరిస్తుంటారు. ఏయే ప్రాంతాల్లో గాల్లో పుప్పొడి రేణువుల శాతం ఎంత ఉందో వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తుందంటే.. ఏ స్థాయిలో అలర్జీతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వాతావారణ శాఖ ఇచ్చే సమాచారం ప్రకారం.. వారు మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్తుంటారు.
వంటల వద్ద తప్పదు మాస్క్
ప్రజారోగ్యం దృష్ట్యా వంటశాలల్లో పనిచేసేవాళ్లు పరిశుభ్రంగా ఉండాలి. శుభ్రతను పరిశీలించేందుకు ప్రత్యేకంగా అధికారులు ఉంటారు. రెస్టారెంట్లలో వంటలు చేసేవారు, వడ్డించేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే సమయంలోనూ సిబ్బంది కచ్చితంగా ముఖ కవచాలు ధరిస్తారు.
చలి నుంచి రక్షణ కోసం...
జపాన్‌లో శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం చాలా మంది సర్జికల్ మాస్క్‌ను ధరిస్తారు. అది ముఖాన్ని వెచ్చగా ఉంచుతుంది. బయటి చలి, పొడి గాలి నుంచి రక్షణ కల్పించడమే కాకుండా.. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మాస్క్ తేమను ఏర్పరుస్తుంది. అది గొంతు తడారకుండా చూస్తుంది.
మాస్క్ ఉంటే మేకప్ లేనట్లు..!
జపాన్‌లో అమ్మాయిలు మేకప్ వేసుకోనప్పుడు మాస్క్‌లు తప్పనిసరిగా ధరిస్తారు. దేశవ్యాప్తంగా అందరూ సమయపాలన పాటిస్తారు. ఎప్పుడైనా మేకప్ వేసుకోవడానికి సమయం లేకపోతే మాస్క్‌తో ముఖాన్ని కవర్ చేస్తారట. ముఖంపై మొటిమలు, స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు అవి కనిపించకూడదని మాస్క్‌ను పెట్టుకుంటారట. అక్కడ మగవాళ్లు ఎప్పుడూ క్లీన్ సేవ్‌తో గడ్డం లేకుండా కనిపిస్తుంటారు. ఎప్పుడైనా సమయం లేక గడ్డం తీసుకోలేకపోతే.. మాస్క్‌ను ధరించి గడ్డం కనిపించకుండా జాగ్రత్త పడతారట. మాస్క్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యం విషయంలోనూ ఉపయోగపడుతుందన్నమాట.
భావాలను పంచుకునేందుకు ఇష్టంలేక..
ఎదుటి వ్యక్తుల్ని చూడటంతోనే వారిని జడ్జ్ చేసే అలవాటు జపాన్‌లో అధికం. దీంతో ముభావంగా, నిస్పృహతో ఉండే వ్యక్తులు, సిగ్గు ఎక్కువగా ఉండే వాళ్లు తమ భావాలను ఎదుటివారితో పంచుకోవడానికి ఇష్టపడరు. నిజానికి సమాజానికి దూరంగా ఉండాలని భావిస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి వారికి తమ ముఖం కనిపించకుండా మాస్క్‌ను ధరిస్తారు. గందరగోళ ప్రపంచంతో పోటీపడలేక ఆత్మరక్షణలా మాస్క్‌ను ఉపయోగిస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది మాస్క్ ధరించాలి. అది ఆరోగ్య పరిరక్షణలో ప్రాథమిక అంశం. కానీ మన దగ్గర సాధారణ చికిత్స సమయంలో వైద్య సిబ్బంది పెద్దగా మాస్కులు ధరించరు. కానీ జపాన్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని వేళలా కచ్చితంగా మాస్కులు ధరిస్తారు.
ఇదీ చూడండి: వృద్ధ జనాభా ఉన్న దేశంలో.. కరోనా కట్టడి సాధ్యమైందా?