కరోనా వైరస్ మూలాలపై పరిశోధన చేసేందుకు చైనాలో పర్యటిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందం.. వుహాన్‌లోని ఓ ప్రాంతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రాన్ని సోమవారం సందర్శించింది. కొవిడ్ ఆనవాళ్లపై పరిశోధనకు గానూ గత నెలలో వుహాన్‌కు వచ్చింది బృందం. వైరస్ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తోన్న హునన్ సీ-ఫుడ్ మార్కెట్, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, స్థానిక ల్యాబ్‌లను సందర్శించారు నిపుణులు. వారితో పాటు చైనా అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు.
వైరస్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా సంక్రమించింది అనే ఆధారాలకోసం సుమారు ఏడాది కాలంగా అన్వేషణ సాగుతోంది. ఈ నేపథ్యంలో వుహాన్ ప్రాంతంలో డబ్ల్యూహెచ్ఓ బృందం సేకరించే ఆధారాలు అత్యంత కీలకం కానున్నట్టు భావిస్తున్నారు అధికారులు. ఇందుకోసం జంతు నమూనాలు సేకరించి జన్యు విశ్లేషణ చేయాలి. అనంతరం.. వాటిపై ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు సహా.. భారీ స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉంది.
ఇదీ చదవండి: డబ్ల్యూహెచ్ఓ పర్యటనతో చైనా కరోనా గుట్టు వీడుతుందా?