ప్రపంచంపై కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్ని దేశాలు ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం లక్షా 83వేలకుపైగా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. ఒక్క రోజులో 4వేల 743మంది ప్రాణాలు కోల్పొయినట్లు వెల్లడించింది. పరీక్షల సంఖ్య పెరిగినందు వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదివారం ప్రకటించిన కేసుల్లో అత్యధికంగా బ్రెజిల్లో 54వేల 771 నమోదైనట్లు డబ్ల్యూహెచ్వో వివరించింది. 36వేల617 కేసులతో అమెరికా, 15,400 కేసులతో భారత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు తెలిపింది. కొత్తగా సంభవించిన మరణాల్లో 70శాతం అమెరికా దేశాలకు చెందినవిగా పేర్కొంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 90 లక్షల 44వేల 563కు చేరింది. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4లక్షల 70వేల 665కి పెరిగింది. మహమ్మారి బారినపడి 48లక్షల 37వేల 952మంది కోలుకున్నారు.
3నెలల తర్వాత..
కరోనా కట్టడిలో భాగంగా 3నెలల లాక్డౌన్ తర్వాత ఆరోగ్య అత్యయిక స్థితిని స్పెయిన్ ఎత్తివేసింది. 4కోట్ల 70లక్షల మంది దేశవ్యాప్తంగా ప్రయాణించే స్వేచ్ఛ నిచ్చింది. బ్రిటన్, 26 ఐరోపా దేశాల నుంచి వచ్చే సందర్శకులకు 14రోజుల క్వారంటైన్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా వైరస్ రెండో దఫా విజృంభించే అవకాశం ఉందని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రజలను హెచ్చరించారు. తప్పనిసరిగా కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
2.5కోట్ల పరీక్షలు..
అమెరికాలో 2కోట్ల 50లక్షల టెస్టులు నిర్వహించినట్లు ఒక్లామా టుల్సాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే కేసుల సంఖ్య పెరగడం బాధాకరమన్నారు. పరీక్షల సంఖ్య పెంచితేనే కేసులు ఎక్కువగా బయటపడతాయని స్పష్టం చేశారు. అందుకే టెస్టుల సంఖ్య తగ్గించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఆదివారం నాడు చైనాలో 25, దక్షిణ కొరియాలో దాదాపు 200 కొత్త కేసులు నమోదైనట్లు డబ్లూహెచ్వో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు..
దేశం | కేసులు | మరణాలు | |
1 | అమెరికా | 2,356,657 | 1,22,247 |
2 | బ్రెజిల్ | 1,086,990 | 50,659 |
3 | రష్యా | 5,84,680 | 8,111 |
4 | భారత్ | 4,10461 | 13,254 |
5 | బ్రిటన్ | 3,04,331 | 42,632 |
6 | స్పెయిన్ | 2,93,352 | 28,323 |
7 | పెరు | 2,54,936 | 8,045 |
8 | చిలీ | 2,42,355 | 4,479 |
9 | ఇటలీ | 2,38,499 | 34,634 |
10 | ఇరాన్ | 2,04,952 | 9,623 |