కరోనా వైరస్ సోకిన రోగి ప్రాణాలు కాపాడేందుకు చివరి ప్రయత్నంగా ఊపిరితిత్తుల మార్పిడి(లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయాలని భావిస్తున్నారు వియత్నాం వైద్యులు. ఆ దేశంలో తొలి కరోనా మరణం నమోదు కాకుండా ఈ మేరకు ప్రయత్నాలు చేసేందుకు యోచిస్తున్నారు.
కరోనా బారిన పడిన 43ఏళ్ల బ్రిటీష్ పైలట్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఊపిరితిత్తులు 90 శాతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పూర్తిగా వెంటిలేటర్లపైనే ఆధారపడ్డాడు. అతన్ని కాపాడాలంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెబుతున్నారు. మార్చిలో అతను ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
బ్రిటీష్ పైలట్‌కు సరైన ఊపిరితిత్తుల కోసం వైద్యులు అన్వేషణలో ఉన్నారు. అవయవ దానం కోసం 30 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు స్థానిక వార్తా పత్రిక తెలిపింది. అయితే ఊపిరితిత్తుల మార్పిడికి బ్రెయిన్‌డెడ్ రోగులను తప్ప మిగతా ఎవరి నుంచి అవయవాలు తీసుకోవడానికి వియత్నాం వైద్య నిబంధనలు అనుమతించవు.
కరోనాపై పోరులో భాగంగా వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు తమవంతు సాయంగా ఊపిరితిత్తులో కొంత భాగాన్ని దానం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వాలంటీర్లు చెబుతున్నారు.
2017లో విజయవంతం..
జపాన్ నిపుణుల సహకారంతో 2017లో ఏడేళ్ల బాలుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేశారు వియత్నాం వైద్యులు. బాలుడి బంధువులు కలిసి తమ ఊపిరితిత్తులలో కొంత భాగాన్ని అప్పుడు దానం చేశారు.
హోచిమిన్ నగరంలో కరోనా బారిన పడిన రోగుల్లో బ్రిటీష్ పైలట్ ఒకరు. మిగతా వారందరూ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇతని ఆరోగ్యం మాత్రం విషమించింది. వియత్నాంలో ఇప్పటివరకు 312 పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ ఒక్క మరణం కూడా సంభవించలేదు. అందుకే పైలట్ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని భావిస్తున్నారు వైద్యులు.