కరోనా వైరస్ వ్యాప్తిపై అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పరిస్థితి చేయి దాటకముందే అన్ని దేశాలు కలిసి కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చింది.
చైనాను సందర్శించని వారికీ వైరస్ సోకడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తక్కువ కేసులే నమోదైనప్పటికీ.. భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే 1000కిపైగా ప్రాణాలు బలిగొన్న ఈ వైరస్‌ను అరికట్టేందుకు అన్ని దేశాలు కలిసి త్వరితగతిన పరిష్కారాన్ని కనుగొనాలని పిలుపునిచ్చారు టెడ్రోస్.
"ఈ మధ్య కాలంలో చైనాను సందర్శించని వారికీ వైరస్ సోకినట్లు విన్నాం. నిన్న ఫ్రాన్స్‌లో, ఈ రోజు బ్రిటన్‌లో వైరస్ సోకిన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైతే తక్కువ కేసులే గుర్తించినా.. అవి పెరిగే అవకాశం ఉంది."
-టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
చైనాలో ఇప్పటికే వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,016కు పెరిగింది. ఒక్క హుబే రాష్ట్రంలోనే సోమవారం 108మంది మృతి చెందారు. ప్రస్తుతం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 40వేలకు పైగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇతర దేశాల్లోని దాదాపు 30 ప్రాంతాల్లో 350 మందికి పైగా వైరస్ సోకింది.
బీజింగ్‌కు అంతర్జాతీయ నిపుణులు..
ఇప్పటివరకు నమోదైన వాటిలో 85 శాతం కేసులు సామాన్య లక్షణాలు కలిగి ఉన్నాయని, 15 శాతం తీవ్రమైనవని గెబ్రియెసస్ వివరించారు. 3 నుంచి 5శాతం మందికి అత్యవసర చికిత్స(ఐసీయూ) అవసరమని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో చైనా అధికారులకు సాయం చేసేందుకు..అంతర్జాతీయ వైద్య నిపుణుల బృందాన్ని డబ్ల్యూహెచ్ఓ బీజింగ్‌కు పంపినట్లు టెడ్రోస్ వెల్లడించారు.