అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ నేత జో బైడెన్ను ఎన్నుకుంటే దేశం నాశనం కాక తప్పదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బైడెన్ అజెండా దేశానికి ఏమాత్రం మంచి చేయదని నొక్కి చెప్పారు. ప్రపంచంలో అమెరికాను నవ్వుల పాలు చేయడమే బైడెన్ విధానాల ఆశయం అన్నారు.
"అమెరికాలో కరోనా విజృంభిస్తుంటే.. ఈ మహా విపత్తును కూడా రాజకీయం చేస్తున్నారు బైడెన్. దేశ ప్రజలపై ఆయనకు ఏమాత్రం గౌరవం లేదు. అడుగడుగునా బైడెన్ తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి మనిషి గనుక అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రపంచ దేశాల ముందు అమెరికా నవ్వులపాలు కావడం ఖాయం. మన దేశం సర్వ నాశనం అయిపోతుంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
దొంగలు, ఉగ్రవాదులు, అక్రమ చొరబాటుదారులు అమెరికాలో స్వేచ్ఛగా తిరగడమే బైడెన్ కోరికని ట్రంప్ విమర్శించారు. బైడెన్ అధ్యక్షుడిగా గెలిస్తే.. ఆయన విధానాలతో కేవలం మూడు నెలల్లోనే దేశంలోని 300 మిలియన్ ప్రజలు కరోనా బారినపడతారన్నారు. కాస్తైనా శాస్త్రీయత లేని బైడెన్ విధానాలను అనుసరిస్తే దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు. ఓవర్ డోసులు, ఆత్మహత్యలు, గుండెపోటు ఇతర మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
"డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి నామినేట్ అయిన బైడెన్ సరిహద్దులు లేని అమెరికా కావాలనుకుంటున్నారు. కానీ, సరిహద్దులు లేకపోతే దేశమే ఉండదు. డెమొక్రటిక్ పార్టీకి కావల్సిందే అదే కదా!"
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదీ చదవండి: అమెరికా ఉపాధ్యక్ష రేసులో భారత సంతతి కమలా హ్యారిస్