అఫ్గానిస్థాన్‌లో 18 ఏళ్లుగా నెలకొన్న అంతర్యుద్ధ వాతావరణాన్ని మార్చే దిశగా అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాలిబన్లతో ఫిబ్రవరి 29న ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటించింది అమెరికా. అఫ్గానిస్థాన్‌లో హింసను రూపుమాపే దిశగా ఈ ఒప్పందాన్ని చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటన విడుదల చేశారు.
ఫిబ్రవరి 29న ఖతార్ రాజధాని దోహాలో ఒప్పందం కుదిరిన వెంటనే అఫ్గాన్‌లో అంతర్గత సంప్రదింపులు ప్రారంభమవుతాయని వెల్లడించారు పాంపియో. అయితే సవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అఫ్గాన్ జారవిడుచుకోవద్దని తెలిపారు పాంపియో.
"అమెరికా-తాలిబన్ల మధ్య అవగాహన ఒప్పందం త్వరలో చేసుకోబోతున్నాం. ఒప్పందంపై ఫిబ్రవరి 29న సంతకాలు జరుగుతాయి. ఈ తొలి అడుగుతో శాశ్వత కాల్పుల విరమణ అమలులోకి రావడమే కాక అఫ్గానిస్థాన్ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమమవుతుంది."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి
అమెరికా-తాలిబన్ల ఒప్పందంపై స్పందించారు అఫ్గానిస్థాన్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జావెద్ ఫైజల్. హింసను తగ్గించేందుకు అమెరికా, తాలిబన్ సంస్థ, అఫ్గాన్ భద్రతా బలగాల మధ్య ఒప్పందం కుదరనుందని పేర్కొన్నారు.
18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం..
సుదీర్ఘ కాలంగా తాలిబన్లతో, అమెరికా శాంతి చర్చల ప్రతిపాదన వస్తూనే ఉంది. గత సెప్టెంబర్‌లో అర్ధంతరంగా చర్చలు ముగించిన అధ్యక్షుడు ట్రంప్.. ఇటీవలే పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందం కుదిరితే అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, 18 ఏళ్ల సుదీర్ఘ మిలిటరీ ఒప్పందానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్గాన్‌లో 12వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు.
ఇటీవలే డిసెంబరులో ఖతార్ వేదికగా ఇరు పక్షాల మధ్య చర్చలు పునఃప్రారంభమయ్యాయి. కాగా.. అఫ్గాన్ బాగ్రామ్లోని అమెరికా సైనిక స్థావర సమీపంలో జరిగిన దాడి తర్వాత చర్చలకు కొద్ది రోజుల విరామం వచ్చింది. మళ్లీ దోహా చర్చల్లో శాంతి ఒప్పందం దిశగా ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ట్రంప్ సన్నిహితుడికి 40నెలల జైలు శిక్ష