తమ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చలేదన్న పాకిస్థాన్ వాదనలకు బలం చేకూరేలా అమెరికాకు చెందిన 'ఫారిన్ పాలసీ మ్యాగజైన్' ఓ కథనం ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా పాక్‌కు అమెరికా అందించిన ఎఫ్-16 యుద్ధ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని కథనంలో పేర్కొంది. అమెరికా రక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించారని తెలిపింది.
పాక్ ఆహ్వానం మేరకు ఎఫ్-16 యుద్ధ విమానాలను లెక్కించేందుకు అమెరికా సైన్యం వెళ్లింది. "క్షేత్రస్థాయిలో.. పాకిస్థాన్‌లో ఎఫ్-16 యుద్ధ విమానాల లెక్కింపు పూర్తయింది. అక్కడ విమానాలన్నీ ఉన్నాయి" అని ఓ అమెరికా సైనికాధికారి తెలిపినట్లు 'ఫారిన్ పాలసీ మ్యాగజైన్' పేర్కొంది.
అయితే ఈ విషయంపై అమెరికా అధికారులు ఇంకా స్పందించలేదు.
ఇదీ జరిగింది....
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్ ఘాటుగా స్పందించింది. బాలాకోట్‌లోని పాక్ ఉగ్ర శిబిరాలను వైమానికి దాడులతో నేలమట్టం చేసింది. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడికి యత్నించిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్టు ఫిబ్రవరి 28న రక్షణ అధికారులు ప్రకటించారు.