సైనిక తిరుగుబాటు జరిగిన మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ దేశ వ్యవహారాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక రాయబారి క్రిస్టినీ షారనర్ బర్గ్‌నర్.. భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు. మయన్మార్ సైన్యం శాంతియుతంగా నిరసన తెలిపిన 50 మంది అమాయకుల ప్రాణాలను తీసిందని ఫిర్యాదు చేశారు. ఇలాంటివి కట్టడి చేసేందుకు అత్యవసరంగా సమష్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా సైన్యాన్ని దూరంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ చర్యలు తీసుకోవాలని భద్రతా మండలికి ఆమె విజ్ఞప్తి చేశారు.
అటు మయన్మార్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. మిత్రదేశాలతో ఈ అంశాలను చర్చిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అన్ని అంశాలు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారం కావాలని పేర్కొంది. హింస నేపథ్యంలో మయన్మార్ నుంచి అక్కడి పోలీసులు సహా కొందరు పౌరులు సరిహద్దు దాటి భారత్‌లోని మిజోరాంకు వచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: 'రైతుల ఉద్యమాలపై చర్యలు భారత అంతర్గత విషయం'