కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి తమ పరిశోధనలను దొంగలించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని బ్రిటన్, అమెరికా, కెనడా ఆరోపించాయి. కోజీ బేర్‌గా పిలిచే ఏపీటీ29 హ్యాకింగ్ బృందం.. తమ ఎకాడమీ, ఫార్మా పరిశోధన వ్యవస్థలపై దాడి చేస్తోందని పేర్కొన్నాయి. ఈ కోజీ బేర్.. రష్యా నిఘా సంస్థకు చెందినదిగా వెల్లడించాయి.
అమెరికా, కెనడా సమన్వయంతో.. ఈ విషయాన్ని బ్రిటన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సెంటర్ ప్రకటించింది. అయితే ఈ దాడులు పరిశోధనను దెబ్బతీయడానికి కాదని.. వాటి ఫలితాలను దొంగలించడానికే జరుగుతున్నాయని అధికారులు తేల్చిచెబుతున్నారు.
ఇప్పటివరకు ఎటువంటి కీలక సమాచారాన్ని దొంగలించలేదని బ్రిటన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. ఈ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలుసా? లేదా? అన్నది కూడా అస్పష్టంగానే ఉంది.
2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాటిక్ జాతీయ కమిటీ కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి చొరబడి విలువైన ఈ-మెయిల్స్‌ను దొంగలించిన రెండు బృందాల్లో కోజీ బేర్ ఒకటని అమెరికా గుర్తించింది.
ఇదీ చూడండి:- రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి!