భారత్‌కు చెందిన కిరణ్ బాబు, ముస్లిం యువతి సనమ్ సబూ సిద్దిఖిని కేరళలో 2016లో వివాహం చేసుకున్నారు. తర్వాత యూఏఈకి వెళ్లి షార్జాలో నివాసముంటున్నారు. ఈ జంటకు జులై 2018లో పాప జన్మించింది. అయితే.. వీరి వివాహం యూఏఈ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వారి కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు.
అక్కడి వివాహ నిబంధనల ప్రకారం ఇస్లాం పురుషుడు.. వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లాడవచ్చు. అదే.. ముస్లిం యువతి వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకునే వీలు లేదు.
''నాకు అబుదాబి వీసా ఉంది. గర్భం దాల్చిన నా భార్యను ఎమిరేట్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించాను. పాప జన్మించింది. నేను హిందువైన కారణంగా.. మా బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరించారు. కోర్టును ఆశ్రయించాను. నాలుగు నెలల అనంతరం నా కేసు తిరస్కరణకు గురైంది.''
- కిరణ్ బాబు
సహనం కలిగిన దేశంగా ఒక చక్కని ఉదాహరణ కోసం, వివిధ సంస్కృతులకు తగినట్లుగా ప్రజలు చక్కని జీవనశైలిని అలవర్చుకోవడానికి 2019ని 'సహనశీల సంవత్సరం'గా ప్రకటించింది యూఏఈ.
ఆ సమయంలో మరోసారి కోర్టును ఆశ్రయించారు కిరణ్ బాబు. న్యాయస్థానం కేసును స్వీకరించింది. అనంత ఏస్లీన్ కిరణ్ అనే వారి పాపకు తొమ్మిది నెలల వయసులో ఏప్రిల్ 14న జనన ధ్రువీకరణ లభించిందని పేర్కొన్నారు.
యూఏఈ ప్రభుత్వం తొలిసారి నిబంధనలను సవరించి తమ పాపకు ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు అధికారులు తెలిపారని పేర్కొన్నారు కిరణ్.