హగీబిస్ తుపానుకు జపాన్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు జపాన్‌వాసులు సతమతమవుతున్నారు. హగీబిస్ కారణంగా ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో భాగంగా ఓ వృద్ధురాలు హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడి మృతి చెందింది. ఈ ఘటనపై జపాన్ ప్రభుత్వం క్షమాపణలు తెలిపింది.
వణుకుతున్న జపాన్..
భీకర గాలులతో కూడిన తుపానుతో జపాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు, పడవలతో వేలాది మంది భద్రత సిబ్బంది కృషి చేస్తున్నారు.
తుపాను కారణంగా జపాన్ వ్యాప్తంగా ఉన్న 14 నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. వాటిలో కొన్ని నదులు ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ప్రమాదపు స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు పేర్కొంది.
ప్రమాదం తీవ్రత ఇలా...
జపాన్ విపత్తు నిర్వహణ విభాగ గణాంకాల ప్రకారం.. ప్రకృతి విపత్తుకు అదివారం ఒక్క రోజే 14 మంది మరణించగా మరో 11 మంది గల్లంతయ్యారు. 187 మందికి గాయాలయ్యాయి. హగీబిస్ కారణంగా 1,283 ఇళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. వాటిలో 517 నివాసాలు పూర్తిగా ధ్వంసమమయ్యాయి.
వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్షలాది గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి.
ఇదీ చూడండి: హాంకాంగ్‌లో ఫ్లాష్మోబ్తో నిరసనలు..!