వియాత్నాంలో తుపాను, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. తుపాను బీభత్సానికి అనేక చోట్ల విద్యుత్ అవాంతరాలు ఏర్పడ్డాయి. ఫలితంగా గురువారం సుమారు 17 లక్షల మంది కరెంట్ కష్టాలు ఎదుర్కొన్నారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా.. పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలూ ఎదురయ్యాయి. అయితే.. గత 20ఏళ్లలో ఇదే అత్యంత భయంకరమైన తుపాను అని అధికారులు పేర్కొన్నారు.
ఆ దేశంలో మూడు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు అక్కడి సహాయక బృందం భావిస్తోంది. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.
మొలావ్ బీభత్సం..
మరోవైపు.. ఆ దేశంలో మొలావ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 150కిలోమీటర్ల(93 మైళ్లు) వేగంతో ప్రమాదకరస్థాయిలో గాలులు వీస్తున్నాయి. మొలావ్ ధాటికి ఇప్పటివరకు 12 మంది మత్స్యకారులు చనిపోగా.. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి- ఐరోపాలో కోటి మార్క్‌ను దాటిన కరోనా కేసులు