ఎట్టకేలకు అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలకు మార్గం సుగమమైంది. వందలాది మంది ప్రతినిధులతో కూడిన అఫ్గాన్ సంప్రదాయ మండలి.. 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. తాలిబన్లతో వెంటనే చర్చలు జరపటంతోపాటు కాల్పుల విరమణ పాటించాలంటూ... అఫ్గాన్ అధికారవర్గాలు ఓ డిక్లరేషన్ విడుదల చేశాయి.
అయితే చర్చల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. తాలిబన్ రాజకీయ కార్యాలయం ఉన్న ఖతార్ వేదికగా.. వచ్చేవారం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అఫ్గాన్ ప్రతినిధుల నిర్ణయాన్ని ప్రశంసించారు అధ్యక్షుడు అష్రఫ్ ఘని. తాలిబన్లు హింసకాండను విడనాడాలని కోరారు.
అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చల కోసం అమెరికా, తాలిబన్ ప్రతినిధుల మధ్య గత ఫిబ్రవరిలో శాంతి ఒప్పందం కుదిరింది. తాజా నిర్ణయం అఫ్గాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ, సుదీర్ఘ సైనిక ఒప్పందాన్ని ముగించేందుకు ఉపయోగపడనుంది.
స్వాగతించిన తాలిబన్లు..
అఫ్గాన్‌లో దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి తెరపడనుంది. ప్రభుత్వ నిర్ణయం సరైన, సానుకూల ముందడుగుగా అభివర్ణించారు తాలిబన్ రాజకీయ ప్రతినిధి సుహేల్ షాహీన్. తమ ఖైదీలను విడుదల చేసిన తర్వాత వారంరోజుల్లో చర్చలు మొదలవుతాయని తెలిపారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తాలిబన్ కట్టుబడి ఉందన్నారు.
ఇదీ చూడండి: సూపర్ మార్కెట్లో 'బీరుట్ పేలుళ్ల' భయానక దృశ్యాలు