అల్బేనియా దేశంలో ఫిబ్రవరి నుంచి జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అధ్వర్యంలో వేలాది మంది ఆందోళనకారులు రాజధాని టిరానా వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని 'ఈది రామ'కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఆందోళన కారులను అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు వందలాది మందిపై బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసుల చర్యపై ప్రభుత్వ వ్యతిరేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు.
ప్రభుత్వంపై ఆరోపణలు
'ఈది రామ' నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం నేరాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తోందని అందుకే ముందస్తు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తోసిపుచ్చిన ప్రధాని
ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు అల్బేనియా ప్రధాని ఈది రామ. ఇలాంటి ఆందోళనలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ప్రజలకు విన్నవించారు.
ఇదీ చూడండి : 'ఆచూకీ చెప్తే రూ.5 లక్షల నగదు బహుమతి'