నెర్రిగుండా.. న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ కుగ్రామం. కార్చిచ్చు ఆ పల్లెను తీవ్రంగా దెబ్బతీసింది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ ఊరి ఆనవాళ్లను చరిత్రలో కలిపేసింది. మూడింట రెండొంతుల గృహాలను దహించి వేసి.. ఓ 70 ఏళ్ల వృద్ధుడిని బలి తీసుకుంది.
ఆస్ట్రేలియాలో చెలరేగుతున్న వెడి గాలులు, మంటలు ఇలాంటి ఎన్నో చిన్ని చిన్న సమూహాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. హెక్టార్ల కొద్ది అటవిని కాల్చివేస్తున్నాయి. దావానలం ధాటికి పలు వన్యప్రాణులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి.
స్కై థ్రెల్ఫాల్ అనే యువతి తన సోదరుడు, సోదరితో కలిసి క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరైన నెర్రిగుండాకు వచ్చారు. ఇక్కడ వారి తల్లి డెబోరా థ్రెల్ఫాల్ నివాసం ఉంటారు. డిసెంబర్ 31న గ్రామానికి మంటలు వ్యాపించాయి. ఉదయం 4 గంటల సమయంలో వారి ఇంటి సమీపానికి మంటలు చేరుకోవడం వల్ల తల్లీబిడ్డలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులుతీశారు. పక్కన ఉన్న పట్టణానికి తల్లి వెళ్లగా.. ముగ్గురు పిల్లలు స్థానిక అగ్ని మాపక కేంద్రానికి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు.
" తీవ్రంగా వీస్తోన్న గాలుల వల్ల మంటలు మా ఇంటివైపు నెట్టుకొచ్చాయి. మెరుపు వేగంతో అగ్ని వ్యాపించింది. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు ఊహాతీతంగా ఉన్నాయి. దాని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ మంటలు మళ్లీ వ్యాపిస్తే నేను భరించలేను."
- స్కై థ్రెల్ఫాల్, నెర్రిగుండా నివాసి
ఒకప్పుడు బంగారం మైనింగ్ టౌన్‌గా చెప్పుకునే నెర్రిగుండాలో క్రమక్రమంగా నివసించేవారు తక్కువయ్యారు. ప్రస్తుతం కొన్ని డజన్ల కుటుంబాలు మాత్రమే అక్కడ జీవనం సాగిస్తున్నాయి. అయితే దావానలం ధాటికి అందులో రెండొంతుల ఇళ్లు, పురాతన పాఠశాల భవనం, చర్చి అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు అదుపులోకి వచ్చాక.. డెబోరా థ్రెల్ఫాల్ తన పిల్లలను కలుసుకున్నారు. తన ముగ్గురు బిడ్డలను ఆశ్రయం కల్పించిన ఫైర్ స్టేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
" మంటలు ఎగిసి పడుతున్న సమయంలో నా కుటుంబాన్ని కోల్పోతాను అనుకున్న.. వారికి ఆశ్రయం కల్పించిన అగ్నిమాపక కేంద్ర నిర్వహకులను ధన్యవాదాలు. నా పిల్లలను కలిసిన తర్వాత ఒకరికిఒకరం బిగ్గరగా కౌగిలించుకున్నాం. వారి చేతులను నా చేతితో పట్టుకున్న ఆ క్షణం మరిచిపోలేను. "
-డెబోరా థ్రెల్ఫాల్, తల్లి
ఇదీ చూడండి: ప్రపంచాన్ని చుట్టిన ఆస్ట్రేలియా కార్చిచ్చు పొగ: నాసా