అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు థాయ్లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు ఆరు వేల భాట్ల(సుమారు రూ.14,270) జరిమానా విధించారు! దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్ నుంచి థాయ్ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
మాస్కు ధరించకపోతే భారీ ఫైన్
ఇక బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం.. రాజధానిలోని ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించే వారికి 20,000 భాట్లు(రూ.47,610) జరిమానా విధిస్తారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయమై సలహాదారులతో ప్రధాని ప్రయూత్.. సోమవారం సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాస్కు ధరించలేదు. ఈ విషయంపై తానే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంకాక్ గవర్నర్ ఆశ్విన్ క్వాన్ ముయాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించారు. కాసేపట్లోనే ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రధాని తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడం వల్ల ప్రయూత్కు అధికారులు జరిమానా విధించారు.
కాగా, థాయ్లాండ్ పౌరులు మినహా మిగతా వారికి తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఇచ్చే ప్రవేశ ధ్రువీకరణ పత్రాల(సీఓఈ) మంజూరును మే 1 నుంచి రద్దు చేస్తున్నట్లు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది భారతీయులకు వర్తిస్తుంది.
ఇదీ చూడండి: 'లాక్డౌన్ కంటే శవాల గుట్టలే మేలు!'